టీడీపీ అధినేత చంద్రబాబు సభలో తొక్కిసలాట జరిగింది. దీంతో 8 మంది దుర్మరణం చెందారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరులో పర్యటిస్తున్నారు. ఇందులో భాాగంగా సింగరాయ కొండ బైపాస్ నుంచి, కందుకూరుకు చంద్రబాబు చేరుకున్న అక్కడి నుంచి పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో కందుకూరులోని ఎన్టీఆర్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు ప్రసంగిస్తున్నారు. కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావడంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట జరగడంతో అక్కడే నిలిపి వుంచిన ద్విచక్ర వాహనాలపై కొందరు పడిపోగా… వారిపై మరికొందరు పడ్డారు. ఇలా తొక్కిసలాట జరగడంతో కొందరు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.

మొత్తం 13 మందిని టీడీపీ నేతలు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 8 మంది మృతి చెందారు. మృతుల్లో కాకుమాని రాజా (48), ఈదుమూరి రాజేశ్వరి (40), కలవకూరి యానాది (55), గడ్డం మధుబాబు (44), యాకసిరి విజయ (45), దేవినేని రవీంద్ర (73), పురుషోత్తం (70), చిన్న కొండయ్య (53) వున్నారు. అయితే… కార్యకర్తలు, ప్రజలు జాగ్రత్తగా వుండాలని చంద్రబాబు హెచ్చరిస్తూనే వున్నారు. ఈ విషాదం జరగడంతో చంద్రబాబు తన ప్రసంగాన్ని నిలిపేశారు. వెంటనే ఆస్పత్రికి చేరుకున్నారు.

పార్టీ తరపున ఎక్స్ గ్రేషియా ప్రకటించిన చంద్రబాబు
ఇలా జరగడం చాలా బాధాకరమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. సభకు వచ్చిన వారంతా రాష్ట్ర ప్రయోజనాల కోసమే వచ్చారని, రాష్ట్రం కోసం త్యాగం చేసిన వారి కుటుంబాలకు తాము అండగా వుంటామని ప్రకటించారు. బాధిత కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. క్షతగాత్రులకు టీడీపీ ఎప్పటికీ అండగానే వుంటుందని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాల్లో చదువుకునే వారుంటే.. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా చదివిస్తామని ప్రకటించారు.












