సిక్కింలోని నాథులా పర్వత ప్రాంతం సమీపంలో భారీ హిమపాతం సంభవించింది. దీంతో ఏడుగురు పర్యాటకులు మరణించారు. మరో 11 మంది గాయపడ్డారు. భారీగా మంచు కురవడంతో దాదాపు 150 మంది పర్యాటకులు చిక్కుకుపోయారని అధికారులు వెల్లడించారు. పర్యాటకుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 22 మందిని రెస్క్యూ చేసినట్లు అధికారులు తెలిపారు. వారందర్నీ ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు ప్రకటించారు. అయితే ఫొటోలు తీస్తుండగా… ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
గాంగ్ టక్ కి 25 కిలోమీటర్ల దూరంలో నెహ్రూ మార్గ్ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. అయితే.. గత మూడు వారాల నుంచి నాథులాతో సహా సిక్కింలోని చాలా ప్రాంతాల్లో హిమపాతం పడుతోందని అధికారులు పేర్కొన్నారు. తోమ్ గో సరస్సుకు వెళ్లే పర్యాటకులు 17 వ మైలు దగ్గరే ఆగిపోయారని, భారీ మంచు కురుస్తుండటంతో రోడ్డు కూరుకుపోయిందన్నారు. పర్యాటకులు ఫోటోలు తీయడానికి, మంచులో ఆడుకోవడానికి కొండవైపు నడుచుకుంటూ వెళ్లిన సమయంలోనే అకస్మాత్తుగా హిమపాతం వచ్చిందని అధికారులు తెలిపారు.