తెలంగాణలో ప్రసిద్ధ ఔషధ సంస్థ గ్లాండ్ ఫార్మా తన వ్యాపారాన్ని విస్తరించనుంది. 400 కోట్ల రూపాయల పెట్టుబడితో తమ తయారీ కేంద్రాన్ని విస్తరించనున్నది. ఈ విస్తరణ ద్వారా మరో 500కు పైగా ఉద్యోగావకాశాలు రానున్నాయి. బయలాజికల్స్‌, బయోసిమిలర్‌, యాంటిబాడీస్‌, రీకాంబినెంట్‌ ఇన్సులిన్‌ తదితర ఔషధాలను ఇక్కడ ఉత్పత్తి చేయనున్నారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ సమక్షంలో ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. గ్లాండ్‌ ఫార్మా గత ఏడాది ఫిబ్రవరిలో రూ. 300 కోట్ల పెట్టుబడితో జీనోమ్‌ వ్యాలీలో వ్యాక్సిన్లు, బయలాజికల్స్‌, బయోసిమిలర్‌, యాంటిబాడీస్‌ తదితర ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేసింది.

ఈ కేంద్రంలో ప్రస్తుతం 200 మంది వరకు సిబ్బంది పనిచేస్తున్నారు. తాజా నిర్ణయంతో 500 మందికి ఉద్యోగాలు కలుగుతాయి. గ్లాండ్‌ ఫార్మా గత 40 సంవత్సరాలుగా జెనరిక్‌ ఇంజెక్టబుల్‌ ఔషధాలతోపాటు ప్రజల ఆరోగ్య సంరక్షణ అవసరాలకోసం నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేస్తున్నది. ప్రస్తుతం భారత్‌లో ఎనిమిది తయారీ కేంద్రాల ద్వారా వెయ్యి మిలియన్‌ యూనిట్ల ఫార్ములేషన్‌ సామర్థ్యం కలిగివున్నది. ఇందులో 28 ప్రొడక్షన్‌ లైన్లుగల నాలుగు ఫినిష్డ్‌ ఫార్ములేషన్ల సౌకర్యాలు, అలాగే జీనోమ్‌ వ్యాలీలోని సౌకర్యం సహా మరో నాలుగు యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రీడియెంట్‌(ఏపీఐ) సౌకర్యాలు ఉన్నాయి.