హైదరాబాద్ లో 29వ యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్

29 భాషల్లో అవార్డులు గెలుచుకున్న 24 చిత్రాల ప్రదర్శన

హైదరాబాద్ ఫిలిం క్లబ్ నిర్వహణలో…డిసెంబర్ 6 నుండి డిసెంబర్ 15 వరకు ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్‌లో…

ప్రపంచంలోని వివిధ జాతులు, భాషలు, సంస్కృతులు, భావోద్వేగాలను తెలుసుకునేందుకు ఫిల్మ్ ఫెస్టివల్స్ ఎంతగానో దోహదం చేస్తాయని పలువురు వక్తలు అన్నారు. 29వ యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్ హైదరాబాద్ ఫిలిం క్లబ్ నిర్వహణలో..డిసెంబర్ 6 నుండి 15 వరకు పది రోజులపాటు హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్‌లో జరగనున్నది.

ఈ సందర్భంగా స్థానిక శ్రీ సారధీ స్టూడియోస్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పాల్గొన్న తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్ మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ భాషలకు చెందిన ఫిల్మ్ ఫెస్టివల్స్ రెగ్యులర్ గా జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటివాటికి తెలుగు చలనచిత్ర పరిశ్రమ సహకారంతో పాటు ముఖ్యంగా ప్రభుత్వ సహకారం అత్యంత ఆవశ్యకం. ఎలాంటి వాటికి సహకారం అందించాలన్న ఆలోచన తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ చేస్తే బావుంటుంది. ఇంతవరకు వారు ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం చేస్తున్నట్లు కనిపించలేదు. మా దర్శకుల సంఘం తప్పకుండా ఫిల్మ్ ఫెస్టివల్స్ కు మా వైపు నుంచి సంపూర్ణ సహకారం అందిస్తాం” అని అన్నారు.

మరో అతిథిగా పాల్గొన్న సీనియర్ దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ, గతంలో ఎన్.టి. రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ సారధ్యంలో జరిపిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవం నభూతో నభవిష్యతి అన్నట్లు జరిగింది. ప్రైవేట్ సంస్థ అయినప్పటికీ హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి, గత యాభై ఏళ్లుగా అంకితభావంతో వివిధ దేశాలకు చెందిన సినిమాలను తీసుకుని వచ్చి, ఫిలిం ఫెస్టివల్స్ రెగ్యులర్ గా నిర్వహిస్తూనే ఉంది. ఈ కోవలోనే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఫిల్మ్ ఫెస్టివల్స్ నిర్వహణకు పూనుకోవాలి” అని అన్నారు.

హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ ప్రెసిడెంట్ కె.వి.రావు మాట్లాడుతూ, ఈ నెల 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పది రోజుల పాటు హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో యూరోపియన్ యూనియన్ లోని వివిధ దేశాలకు చెందిన 29 భాషల్లో అవార్డులు గెలుచుకున్న 24 చిత్రాలను ప్రదర్శిస్తాం. ఐరోపా సినిమాటిక్ విండోను అందించడం, ఖండంలోని అత్యుత్తమ చిత్రాలను ప్రదర్శించడం, క్రాస్-కల్చరల్ అవగాహన పెంపొందించడం కోసం ఈ ఫెస్టివల్ ఎంతగానో ఉపయోగపడుతుంది” అని అన్నారు.

హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ సెక్రటరీ ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, మా ఫిల్మ్ క్లబ్ 50 ఏళ్ళు పూర్తి చేసుకుని, ఈ ఏడాది గోల్డెన్ జూబిలీ ఇయర్ లోకి ప్రవేశించింది. మేము నిర్వహిస్తున్న ఏడవ యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇది. ఫెస్టివల్స్ నిర్వహణలో మాకు శ్రీ సారధీ స్టూడియోస్ అందిస్తున్న సహకారం మరువలేనిది. ఈ ఫెస్టివల్ లోని అన్ని చలనచిత్రాలు ఆంగ్ల ఉపశీర్షికలను కలిగి ఉంటాయి. ఎలాంటి డెలిగేట్ పాస్ లు లేకుండా ప్రేక్షకులకు అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లైనప్‌లో లా చిమెరా, బాన్, జిమ్స్ స్టోరీ, యానిమల్, యాన్ ఐరిష్ గుడ్‌బై, అఫైర్, రిస్టోర్ పాయింట్ వంటి మరెన్నో ప్రశంసలు పొందిన చిత్రాలు ఉన్నాయి” అని అన్నారు.

హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కు స్ఫూర్తి దాయకంగా నిలుస్తుందని ఇదే ప్రెస్ మీట్ లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ సోదరుడు, కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ ప్రెసిడెంట్ పొన్నం రవిచంద్ర, తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ సెక్రటరీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

Related Posts

Latest News Updates