ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జేఏసీ జగన్ సర్కార్ పై సమర శంఖాన్ని పూరించింది. సమస్యలు పరిష్కరించాలన్న డిమాండుతో మార్చి 9 నుంచి ఏప్రిల్ 3 వరకూ దశల వారీగా పోరాటాలు చేస్తామని జేఏసీ నేతలు బొప్పరాజు వేంకటేశ్వర్లు, దామోదరరావు తదితరులు ప్రకటించారు. ప్రభుత్వంతో ఇక తాడో పేడో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. వేతనాలు, పింఛన్లు ఒకటో తేదీనే ఇవ్వాలంటూ అడుక్కోవాల్సిన పరిస్థితి గతంలో లేదని, ఇప్పుడే తలెత్తిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 3 వరకూ దశల వారీగా నిర్వహించే ఉద్యమంతో ప్రభుత్వం స్పందించకపోతే… ఏప్రిల్ 5 న రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి, తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని పేర్కొన్నారు.

తమ ఉద్యమానికి ఇతర కార్మిక, ఉద్యోగ, ప్రజా సంఘాల మద్దతు కూడా కూడగడతామని,రాజకీయ పార్టీలను మాత్రం చేర్చుకోమని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల రీత్యా తాము అనేకసార్లు ప్రభుత్వానికే సహకరించామన్నారు. అయినప్పటికీ ఉద్యోగుల సమస్యల విషయంలో మాత్రం ఎలాంటి పరిష్కారం దొరకడం లేదన్నారు. ‘చలో విజయవాడ’ అనంతరం ముఖ్యమంత్రి అధ్యక్షతన సమావేశం జరిగిందని, ఆ రోజు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు కాలేదన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏర్పాటైన మంత్రివర్గ సంఘం నిర్వహించే సమావేశాలు చాయ్ బిస్కట్ చర్చలే తప్ప.. ఏ ఒక్కటీ పరిష్కరించిన పాపాన పోలేదన్నారు.
తొలి దశ ఉద్యమ కార్యాచరణ ఇదీ…
మార్చి 9, 10 తేదీల్లో: నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు
మార్చి 13, 14: జిల్లా కలెక్టర్, ఆర్‌డీవో కార్యాలయాల దగ్గర భోజన విరామ సమయంలో నిరసనలు
మార్చి 15, 17, 20: కలెక్టరేట్ల వద్ద ధర్నాలు
మార్చి 21 నుంచి: ఉద్యోగుల వర్క్ టు రూల్ (ఉదయం 10 – సాయంత్రం 5.30 గంటలు). రోజంతా సెల్ డౌన్, సెల్‌ఫోన్ ద్వారా అధికారిక కార్యక్రమాలు చేపట్టరు.
మార్చి 24: హెచ్‌వోడీ, కమిషనర్ ఆఫీస్‌ల వద్దధర్నాలు
మార్చి 27: కరోనా సమయంలో చనిపోయి కారుణ్య నియామకాలు పొందని ఉద్యోగుల కుటుంబాల సందర్శన
ఏప్రిల్ 1: పదవీ విరమణ ప్రయోజనాలు అందని ఉద్యోగుల కుటుంబాలు, సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాలు, జీపీఎఫ్, ఏపీజీఎల్‌ఐ, ఆర్జిత మొత్తాలు అందక ఇబ్బంది పడుతున్న ఉద్యోగుల కుటుంబాలకు పరామర్శ.
ఏప్రిల్ 3: ‘చలో స్పందన’లో కలెక్టర్‌కు వినతిపత్రాలు
ఏప్రిల్ 5: రాష్ట్ర కార్యవర్గ సమావేశం.. రెండో విడత ఉద్యమ కార్యాచరణ షెడ్యూల్ ప్రకటన












