సంక్రాంతి సెలవులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోని హైదరాబాద్ లోని ప్రజలు.. తమ తమ సొంతూళ్లకు పయనమయ్యారు. ఈ సందర్భంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో పండగ రద్దీ నెలకొంది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మొత్తం 21 టిక్కెట్ కౌంటర్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలోనే ఈ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. అంతేకాకుండా టిక్కెట్ల కోసం అదనపు సిబ్బందిని కూడా నియమించామని పేర్కొన్నారు.
సాధారణ రోజుల్లో 12 కౌంటర్లు వుండేవని, కానీ.. సంక్రాంతి రద్దీ నేపథ్యంలో 21 టిక్కెట్ కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ఇక.. టిక్కెట్ల తనిఖీ కోసమని 40 మంది సిబ్బందిని కూడా నియమించామని పేర్కొన్నారు. మరోవైపు ప్రజల సౌకర్యం, రక్ష కోసం 60 మంది ఆర్పీఎఫ్ సిబ్బంది, 30 మంది జీఆర్పీ సిబ్బందిని విధుల్లో వుంచుతున్నామని తెలిపింది. రైళ్ల రాకపోకల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రయాణికులకు తెలిపేందుకు అదనంగా మరికొంతమంది అధికారులను ఏర్పాటు చేశారు.