అత్యంత శక్తిమంతమైన జీ 20 కూటమి దేశాల సదస్సు ఇండోనేషియా బాలిలో జరుగనున్నాయి. 15,16 తేదీల్లో 17 వ జీ 20 సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఇండోనేషియాకు బయల్దేరనున్నారు. 3 రోజుల పాటు ఇండోనేషియాలోనే పర్యటిస్తారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ కూడా హాజరవుతున్నారు. మరోవైపు జీ 20 సమావేశాల్లోనే ప్రధాని మోదీ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తో భేటీ అవుతున్నారు. రిషి సునాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ మొదటి సారిగా ఆయనతో భేటీ అవుతున్నారు.
ఇక.. జీ 20 వేదికగా కోవిడ్ 19, ఆర్థిక పునరుద్ధరణ, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఐరోపా సంక్షోభం, ఇంధన భద్రత, ఆహార భద్రతా సవాళ్లు వంటి అంశాలపై చర్చించనున్నారు. వచ్చే యేడాది జీ 20 సమ్మిట్ కు మన భారత్ వేదిక కానుంది. ఇండోనేషియా అధ్యక్షుడి నుంచి ప్రధాని మోదీ లాంఛనంగా అధ్యక్ష బాధ్యతలను స్వీకరిస్తారు. ఇక.. జీ 20 లో ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, టర్కీ, అమెరికా, బ్రిటన్ అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలు సభ్య దేశాలుగా వున్నాయి.