గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర్య ఉద్యమం నుంచి ఇప్పటి వరకూ కాంగ్రెస్ దేశ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తోందని, దేశం కోసం చాలా మంది కాంగ్రెస్ నేతలు ప్రాణాలు వదిలారని అన్నారు. గాంధీ బలిదానం అయినా… ఆయన స్ఫూర్తితోనే కాంగ్రెస్ నడుస్తోందన్నారు. దేశానికి కంప్యూటర్ ను పరిచయం చేసింది తమ పార్టీనేనని రేవంత్ చెప్పుకొచ్చారు. ఉపాధి హామీ, విద్యాహక్కు, సమాచార హక్కు లాంటి చట్టాలు కూడా తెచ్చామని గుర్తు చేశారు. దేశానికి వస్తున్న ముప్పు నుంచి కాపాడటం కోసమే రాహుల్ పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ చేతిలో బందీ అయ్యిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో చేస్తున్న దోపిడీ చాలదన్నట్లు… కేసీఆర్ పార్టీని దేశ వ్యాప్తంగా చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. అందుకే బీఆర్ఎస్ ను కేసీఆర్ విస్తరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన వాటిపై కేంద్రాన్ని ఎందుకు నిలదీయడంలేదని రేవంత్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలు విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని, జనవరి 26 నుంచి ‘హాత్ సే హాత్ జోడో యాత్ర’కు ప్రజలు కడలిరావాలని పిలుపిచ్చారు. అలాగే వ్యక్తిగత సమస్యలపై కాకుండా ప్రజా సమస్యలపై పోరాడేందుకు ముందుకు రావాలని పార్టీ శ్రేణులను కోరుతున్నానని రేవంత్ రెడ్డి అన్నారు.