హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో మధ్యాహ్నం 1 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలుమార్గాలను మూసివేయడంతోపాటు దారిమళ్లించనున్నారు. నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్, ఐమ్యాక్స్ రూట్‌లలోకి వచ్చే ట్రాఫిక్‌ను ఆయా కూడళ్లలో ఇతర మార్గాలకు మళ్లించడంతోపాటు ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్డు, లుంబినీ పార్కులు మూసి ఉంటాయని తెలిపారు. ట్యాంక్‌బండ్‌పై నుంచి వెళ్లే ఆర్టీసీ బస్సులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని అధికారులు సూచించారు.
- ఖైరదాబాద్ చౌరస్తాలోని పీవీ విగ్రహం వద్ద నుంచి నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి జంక్షన్ వైపు వచ్చిపోయే వాహనాలకు అనుమతి లేదు.
- ఖైరతాబాద్, పంజాగుట్ట, సోమాజిగూడ వైపు నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను ఖైరతాబాద్ చౌరస్తా నుంచి సాదన్, నిరంకారి వైపు వెళ్లాలి.
- ట్యాంక్‌బండ్ నుంచి పీవీఎన్‌ఆర్ మార్గ్‌కు వాహనాలను అనుమతించరు. ఈ వాహనాలను సోనబి మాస్క్ నుంచి రాణిగంజ్, కార్బాల వైపు మళ్లిస్తారు.
- రసూల్‌పురా, మినిస్టర్ రోడ్డు నుంచి నెక్లెస్ రోటరీకి నల్లగుట్ట నుంచి వచ్చే వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలు నల్లగుట్ట జంక్షన్ నుంచి రాణిగంజ్ వైపునకు వెళ్లాలి.
- ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి ట్యాంక్‌బండ్, రాణిగంజ్, లిబర్టీ వైపు వాహనాలకు అనుమతి లేదు. తెలుగుతల్లి ైప్లెఓవర్ నుంచి కట్టమైసమ్మ జంక్షన్, లోయర్ ట్యాంక్‌బండ్ మీదుగా వెళ్లాలి.
- ట్యాంక్‌బండ్ నుంచి తెలుగు తల్లి జంక్షన్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహనాలను అనుమతి లేదు. ఈ వాహనాలను ఇక్బాల్ మినార్ జంక్షన్ వైపు వెళ్లాలి.
- బీర్‌కేఆర్ భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వెళ్లే వాహనాలు తెలుగు తల్లి జంక్షన్ నుంచి ఇక్బాల్ మినార్ జంక్షన్ వైపు వెళ్లాలి.
- ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి మింట్‌కంపౌండ్ లేన్‌లోకి వాహనాల అనుమతి లేదు.
- ఖైరతాబాద్ బడా గణేశ్ లేన్ నుంచి ప్రింటింగ్ ప్రెస్ జంక్షన్, నెక్లెస్ రోటరీ వైపు అనుమతి లేదు. ఈ వాహనాలు రాజ్‌దూత్ లేన్ నుంచి వెళ్లాలి.