కేరళ ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయాన్ని ట్రావెన్ కోర్ దేవస్థాన బోర్డు అధికారులు మూసివేయనున్నారు. నవంబర్ 17న ప్రారంభమైన మండల పూజలు ఇవాళ్టితో ముగియనున్నాయి. అయ్యప్ప స్వామి వారికి మంగళవారం పూజలు నిర్వహించి ఆలయాన్ని మూసివేయనున్నారు. డిసెంబర్ 30న సాయంత్రం 5 గంటలకు మకరవిళక్కు పర్వదినం రోజున ఆయ్యప్ప ఆలయాన్ని తిరిగి తెరవనున్నారు. మకర సంక్రాంతి రోజున భక్తులు జ్యోతి దర్శనం చేసుకోనున్నారు. ఆ తర్వాత జనవరి 20న మరోసారి ఆలయాన్ని మూసివేయనున్నారు. ఈ ఏడాది కరోనా ఆంక్షలు సడలించటంతో ఎప్పుడు లేనంతగా భక్తులు పోటెత్తారు. దీంతో 39 రోజుల్లోనే ఏకంగా 223 కోట్లు ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయానికి వచ్చిన ఆదాయంలో మూడోంతులు ఉత్సవాల నిర్వహణకే వినియోగిస్తామని ట్రావెన్కోర్ దేవస్థాన బోర్డు తెలిపింది.












