ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటు రావడంతో మర్రిపాడులోని తన నివాసంలోనే వైద్యులు చికిత్స చేశారు. అనంతరం మర్రిపాడు నుంచి చికిత్స కోస నెల్లూరులోని ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి చెన్నై తరలించే అవకాశాలున్నాయని కుటుంబీకులు పేర్కొంటున్నారు. అయితే… తన ఆరోగ్యం బాగో లేదని, మీడియాతో మాట్లాడలేనని పేర్కొన్నారు. గత నెలలోనే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు వచ్చింది. అప్పుడు రెండు వాల్వులు బ్లాక్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో చికిత్స చేయడంతో కోలుకున్నారు. 2021 డిసెంబర్ లో కూడా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు రావడంతో బెంగళూరులో సర్జరీ చేశారు.

మరోవైపు ఉదయగిరిలో రాజకీయాలు వేడెక్కాయి. ఎమ్మెల్యే మేకపాటి వర్సెస్ వైఎస్సార్‌సీపీ నేతల మధ్య వార్ నడుస్తోంది. రెండు, మూడు రోజులుగా సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారు. చంద్రశేఖర్ రెడ్డిని ఉదయగిరిలో అడుగు పెట్టనివ్వం.. తరిమేస్తామంటూ నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేతలు హెచ్చరించారు. దీంతో గురువారం సాయంత్రం మేకపాటి నేరుగా ఉదయగిరి బస్టాండ్ దగ్గరకు వెళ్లారు.. రోడ్డుపై కుర్చీ వేసుకుని మరీ కూర్చున్నారు. ఎవరో ఉదయగిరికి వస్తే తరుముతామన్నారని.. వాళ్లెవరో ఇప్పుడు రావాలంటూ సవాల్ చేశారు.












