వైఎస్ వివేకా హత్య కేసు : వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కీలక పరిణామం జరిగింది. వైఎస్సార్ జిల్లా పులివెందులలో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఆదివారం ఉదయం తెల్లవారుఝామున పులివెందుల చేరుకున్న సీబీఐ అధికారులు… అవినాష్, భాస్కర్ రెడ్డి నివాసాలకు వెళ్లారు. ఆ తర్వాతే భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. వైఎస్ భాస్కర్ రెడ్డిపై సెక్షన్ 130 బి, రెడ్ విత్ 302, 201 కేసులు నమోదు చేసింది సీబీఐ.

 

మరోవైపు భాస్కర్ రెడ్డి అరెస్ట్ విషయాన్ని సీబీఐ ఆయన భార్యకు తెలియజేసింది. పులివెందులలో భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత సీబీఐ ఆయన్ను హైదరాబాద్ కి తరలిస్తోంది. ఆయన్ను హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు సీబీఐ భాస్కర్ రెడ్డి సెల్ ఫోన్ ను సీజ్ చేసేసింది. వైఎస్ వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిపై మొదటి నుంచీ ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఉదయ్ ని సీబీఐ అరెస్ట్ చేసింది.

 

వివేకానందారెడ్డి మర్డర్‌కేసులో ఉదయ్‌కుమార్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్‌ విధించారు న్యాయమూర్తి. వెంటనే మాసబ్‌ట్యాంక్‌లోని జడ్జి ఇంటి నుంచి ఆయన్ని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఎంపీ అవినాష్‌రెడ్డి ప్రధాన అనుచరుడైన ఉదయ్‌కుమార్‌రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని జడ్జి ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం న్యాయమూర్తి అతనికి ఈనెల 26 వరకూ రిమాండ్‌ విధించిన విషయం తెలిసిందే.

 

ఇక వైఎస్‌. వివేకానందారెడ్డి హత్యకేసులో ఉదయ్‌కుమార్‌ను విచారణ కోసం సీబీఐ కస్టడీ పిటిషన్‌ వేసింది. మరోవైపు ఉదయ్‌కుమార్‌ తరఫున నోటీసులు తీసుకున్న ఆయన న్యాయవాదులు బెయిల్‌ మంజూరు చేయాలని మెజిస్ట్రేట్‌ను కోరారు. అయితే సోమవారం కస్టడీ, బెయిల్‌ పిటిషన్లపై విచారణ చేస్తామని కోర్టు తెలిపింది. వివేకా హత్య జరగిన సందర్భంలో ఎవరెవరు ఉన్నారనే దానిపై సీబీఐ సేకరించిన గూగుల్ టేక్ ఔట్ లో ఉదయ్ కుమార్‌కి సంబంధించిన వివరాలు ఉండడంతో సీబీఐ ఆయన్ని అదుపులోకి తీసుకుంది.

Related Posts

Latest News Updates