కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ అంశంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఈ నెల 25 వరకూ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను వివేకా కుమార్తె డాక్టర్ సునీత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆమె దాఖలు చేసిన పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ముందస్తు బెయిల్ అంశంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తప్పుబట్టింది. అవి ఆమోదయోగ్యం కావని తెలిపింది.
కాగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో.. సీబీఐపై ఎటువంటి ఆంక్షలూ లేకుండా స్వేచ్ఛగా దర్యాప్తు చేయనివ్వాలంటూ సుప్రీంకోర్టులో ఆయన కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సునీత తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూద్రా వాదనలు వినిపించారు. అవినాష్ కి ముందస్తు బెయిల్ ఇస్తే కేసు విచారణపై దాని ప్రభావం పడుతుందని సీబీఐ లాయర్లు వాదించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ… ఈ నెల 24 న పూర్తి స్థాయి విచారణ చేపడతామని, అప్పుడు అన్ని విషయాలను పరిశీలిస్తామని స్పష్టం చేసింది.