నిర్మల్ పట్టణంలో వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రం కోసం కేటాయించిన అటవీ భూమిని, చట్ట విరుద్ధంగా ఈద్గా నిర్మాణం కోసం కేటాయించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. నిర్మల్ చించోలీ గ్రామంలోన సర్వే నెంబర్ 543, 544 , 969 లోని అటవీ భూమిని డీనోటిఫై చేసిందే నిరుద్యోగ యువత భవిష్యత్తు కోసమని, అలాంటి భూమిని తమ స్వార్థ రాజకీయాల కోసం ఈద్గా ప్రార్థనలకు కేటాయించడం చట్టవిరుద్ధమని బండి సంజయ్ ఆక్షేపించారు.
ప్రజా ఉపయోగ కార్యక్రమాల కోసం ఉపయోగించాల్సిన ప్రభుత్వ భూములను ప్రార్థనా స్థలాలకు కేటాయించడానికి వీల్లేదని ప్రభుత్వ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని లేఖలో గుర్తు చేశారు. గతంలో ఏపీ హైకోర్టు సహా పలు కోర్టులు కూడా ఈ మేరకు స్పష్టమైన తీర్పులు ఇచ్చాయన్నారు. అయినా… కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా చించోలీలో ఈద్గాను నిర్మించడమంటే న్యాయ వ్యవస్థను అవమానించినట్లేనని అన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన అటవీ భూములను స్వార్థ రాజకీయాల కోసం వాడాలనుకోవడం నీచమైన పని అని, ఈ చర్యలను ఖండిస్తున్నామన్నారు.
ఈద్గా ప్రార్థన కోసం ప్రభుత్వ భూమిని కేటాయించాలనుకుంటున్న ప్రాంతాలకు అత్యంత సమీపంలో రెండు హిందూ దేవాలయాలు కూడా వున్నాయని బండి సంజయ్ లేఖలో గుర్తు చేశారు. నిరుద్యోగ యువత కోసం కేటాయించిన భూమిని ప్రార్థనా స్థలాలకు కేటాయించడం ఓ పొరపాటు అయితే… ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టేందుకు సర్కార్ స్వయంగా పూనుకోవడం క్షమించరాని నేరమని బండి సంజయ్ గ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా.. వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రం కోసం కేటాయించిన అటవీ భూమిని అదే ప్రయోజనాల కోసం వినియోగించాలని డిమాండ్ చేశారు. అలా చేయకుంటే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, ప్రజల్ని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేసేందుకు సిద్ధమేనని స్పష్టం చేశారు.