వరంగల్ సీపీ రంగనాథ్ ను వదిలే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. విజయవాడ సత్యంబాబు కేసులో సీపీ పాత్ర ఏమిటో తమకు తెలుసన్నారు. నల్లగొండ, ఖమ్మంలో ఏం చేశారో కూడా తెలుసని అన్నారు. హైదరాబాద్ లోని ఓ థియేటర్ లో బండి సంజయ్ బలగం సినిమా చూసిన తర్వాత విలేకరులతో మాట్లాడారు. వరంగల్ సీపీ అవినీతి, అక్రమాల చిట్టాను త్వరలోనే బయపెడతానని చెప్పారు. ఆయనపై పరువు నష్టం దావా వేయబోతున్నట్లు బండి సంజయ్ సంచలన ప్రకటన చేశారు. నువ్వు వేసుకున్న ఖాకీ డ్రెస్ మీద ప్రమాణం చేయాలి. నీ ఆస్తి పాస్తుల చిట్టా బయటకు తీస్తా. సీపీ ఎక్కడెక్కడ దందాలు చేస్తున్నారో తమకు తెలుసని, వరంగల్ సీపీకి చిత్తుశుద్ధి ఉంటే ఆయన ఫోన్ కాల్ లిస్ట్ ను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రితో, మంత్రులతో ఎన్నెన్ని సార్లు, ఎప్పుడెప్పుడు ఈ కేసు గురించి మాట్లాడారో అన్నీ బట్టబయలు అవుతాయని అన్నారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (EVI) బిడ్డింగ్ లో పాల్గొంటానడం చూస్తే నవ్వొస్తుందన్నారు. ఒకటో తారీఖు నాడు సక్రమంగా జీతాలే ఇయ్యలేనివారు, రుణమాఫీ, నిరుద్యోగ భ్రుతిసహా ఇచ్చిన హామీలను అమలు చేయలేనివారు, వైజాగ్ స్టీల్ గురించి మాట్లాడతాడట అంటూ ఎద్దేవా చేశారు. కన్నతల్లికి అన్నం పెట్టలేనోడు… పిన్నతల్లికి బంగారు కడియాలు చేయిస్తానన్నట్లుందని దెప్పి పొడిచారు. ”దాని సంగతి తరువాత… బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ పెట్టి 20 వేల మందికి ఉద్యోగాలిస్తానని చెప్పి ఏళ్లు గడుస్తున్నయ్ కదా.. ఏమైంది? నీకు దమ్ముంటే బయ్యారం స్టీల్ ను ఏర్పాటు చేయ్” అంటూ బండి సంజయ్ సవాల్ విసిరారు.
ఈటల రాజేందర్ కు ఎందుకు నోటీసులు ఇచ్చారో చెప్పాలని, ఆయన చేసిన తప్పేముంది? అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. దమ్ముంటే ఆధారాలు చూపించాలని సవాల్ విసిరారు. మాట్లాడితే ఫోన్ అంటున్నారు. కరీంనగర్ లో తనను అరెస్ట్ చేసినప్పటి నుండి సిద్దిపేట వరకు ఫోన్ ఉందన్నారు. తన పీఏ, తాను కూడా పోలీసుల అదుపులోనే ఉన్నామని, ఫోన్ ను వాళ్లే తీసుకుని నాటకాలాడుతున్నరని ఆరోపించారు. తన ఫోన్ ను సీఎం చూసిన తరువాత చెక్కరవచ్చి పడిపోయిండట. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీల కాల్ లిస్ట్ చూసి ఇంతమంది టచ్ లో ఉన్నారా? అని విస్తుపోయారని బండి సంజయ్ అన్నారు.