హైదరాబాద్ శామీర్‌పేట్‌లోని ల్యాండ్ అఫ్ లవ్ ఆధ్వర్యంలో తెలుగు రంగస్థల దినోత్సవం – 2023ను పురస్కరించుని నిర్వహిస్తున్న తెలుగు రంగస్థల కళాకారుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, థియేటర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుర్మాచలం. ఈ సందర్బంగా ఆయన రంగస్థల కళల్లో విశిష్ట కృషి చేసిన కళాకారులను సన్మానించి, అభినందించారు.
ఈ సందర్బంగా అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు చాటి చెప్పడంలో కవులు, కళాకారులు కీలక భూమిక పోషించారని, రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ కళాకారుల, కవుల ప్రతిభను గుర్తించి సముచితస్థానం కల్పించారన్నారు. నాటకం ఎప్పటికప్పుడు నూతనత్వాన్ని సంతరించుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తుందని, సినిమా మనిషిపై ఎక్కువ ప్రభావం చూపితే నాటకం జీవితాన్ని చూపిస్తుందని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత నాటకరంగానికి పూర్వవైభవం తెచ్చే విధంగా రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమీ, ఎఫ్డీసీ నాటకరంగాన్ని ప్రోత్సహిస్తూనే నాటక సమాజాలకు, సంస్థలకు ఆర్థిక సాయం అందించడమేగాక వర్క్‌షాపులు కూడా నిర్వహిస్తూ కొత్త నాటకాలకు, కళాకారులను ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో సినీ దర్శకుడు వేణు ఉడుగుల, రచయిత్రి కుప్పిలి పద్మ, నిర్వాహకులు పవిత్రమ్ మీసాల, నరేష్ వంగపల్లి, రఘు మందాటి తదితరులు పాల్గొన్నారు.