నాగర్ కర్నూలు జిల్లాలో అత్యంత ప్రసిద్ధమైన నల్లమల సలేశ్వరం లింగమయ్య జాతరలో విషాదం చోటు చేసుకుంది. భక్తుల రద్దీ ఎక్కువగా వుండటంతో తొక్కిసలాట జరిగి జాతరలో ఇద్దరు మరణించారు. వీరు నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన గొడుగు చంద్రయ్య (55), వనపర్తి జిల్లాకు చెందిన అభిషేక్ (32) గా గుర్తించారు. ఈ ఘటన జరగగానే… గుండెపోటుతో ఆమన్ గల్ కి చెందిన విజయ అనే మహిళ గుండెపోటుతో మరణించింది.

 

అయితే..ఈ యేడాది కేవలం 3 రోజులు మాత్రమే యాత్ర జరగనుంది. దీంతో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. మరోవైపు అధిక సంఖ్యలో భక్తులు రావడంతో కిలోమీటర్ల మేర వాహనాలు కూడా నిలిచిపోయాయి. ఇక… సలేశ్వరం యాత్ర సందర్భంగా అధికారులు సరైన ఏర్పాట్లే చేయలేదని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 10 రోజుల పాటు యాత్ర నిర్వహించాల్సింది పోయి… కేవలం 3 రోజులకే కుదించడం ఏంటని మండిపడుతున్నారు.

 

దక్షిణాది అమర్ నాథ్ గా పేరు సంపాదించుకున్న సలేశ్వరం లింగయ్య జాతర ప్రారంభమైంది. మొత్తం 3 రోజుల పాటు సాగనుంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకే ప్రవేశం వుంటుంది. ఇక్కడ చెంచులే ప్రధాన పూజారులుగా వుంటారు. ఎత్తయిన కొండలు.. దట్టమైన అడవి మీదుగా లోతట్టు ప్రాంతంలో సహజసిద్ధ జలపాతాన్ని దాటుకుంటూ.. పున్నమి వెన్నెలలో చెంచుల కులదైవాన్ని దర్శించు కోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. అందుకే రాళ్లు, రప్పలను సైతం లెక్క చేయకుండా దాదాపు 4 కి.మీ. మేర నడక మార్గాన వెళ్లి స్వామిని దర్శించు కుంటారు. అందుకే అత్యంత సాహసోపేత యాత్రగా చెబుతారు.

 

దర్శనానికి వెళ్లేముందు ‘వస్తున్నాం లింగమయ్యా’.. అని, తిరిగి వెళ్లే సమయంలో ‘వెళ్లొస్తాం లింగమయ్యా’.. అంటూ దారి పొడవునా నామస్మరణ మార్మోగనున్నది. ఉమ్మడి జిల్లాతోపాటు తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు నుంచి వేలాదిగా భక్తులు తరలిరానున్నారు. జాతరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నల్లమల కొండపై నుంచి జాలువారే జలపాతాలు.. పచ్చదనంతో నిండిన కొండలు.. కోనలు.. లోయలు.. గుహలు.. ఎటుచూసినా ప్రకృతి రమణీయతే.. ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణంలో లింగమయ్య కొలువుదీరడం నల్లమల వాసుల పుణ్యమని చెప్పొచ్చు.