హైటెక్‌ హంగులతో రూపొందించిన తొమ్మిది ఏసీ స్లీపర్‌ బస్సులను ఆర్టీసీ తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రైవేట్‌ బస్సులకు దీటుగా రూపొందించిన ఈ బస్సులను హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొత్తగా 760 బస్సులకు ఆర్డర్‌ పెట్టామని, వాటిలో ఇప్పటికే 400 పైగా బస్సులు డిపోలకు చేరుకున్నాయన్నారు. ప్రయాణికులకు సౌకర్యం కోసం ప్రైవేటు బస్సులకు దీటుగా లహరి స్లీపర్‌ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు.

 

త్వరలో 1,300 ఈవీ బస్సులను తీసుకొస్తున్నామని, ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని వెల్లడించారు. ఇప్పటికే ఆర్టీసీలో వీలైనంత సాంకేతికతను ఉపయోగిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ వీసీ సజ్జనార్‌ పాల్గొన్నారు. ‘లహరి-అమ్మఒడి అనుభూతి’గా నామరణం చేసిన ఈ బస్సులు బెంగళూరు, హుబ్లీ, విశాఖపట్నం, తిరుపతి, చెన్నై మార్గాల్లో సేవలు అందించనున్నాయి.

లహరి బస్సు సర్వీసుల ప్రత్యేకతలివే…

1. ప్రయాణికుల భద్రతకు బస్సు ట్రాపింగ్ సిస్టంతో పాటు బస్సులో ‘పానిక్ బటన్’ సదుపాయం కల్పించారు. ప్రతి బస్సుకు రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా ఉంటుంది.
2. బస్సు లోపల సెక్యూరిటీ కెమెరాలు, ఫైర్ డిటెక్షన్ – అలార్ సిస్టం ఏర్పాటు చేశారు. ప్రమాదవశాత్తు బస్సులో మంటలు చెలరేగితే ఫైర్ డిటెక్షన్ అప్రమత్తం చేస్తుంది. ప్రయాణికులకు సమాచారం అందించేందుకు పబ్లిక్ అడ్రస్ సిస్టం ఉంటుంది.

3. 12 మీటర్ల పొడవుండే ఈ బస్సుల్లో లోయర్ 15, అప్పర్ 15 కలిపి 30 చొప్పున బెర్తులు ఉంటాయి. ప్రతి బెర్త్ కు మొబైల్ ఫోన్ ఛార్జింగ్ సౌకర్యం, రీడింగ్ ల్యాంప్ ఉంటాయి.

 

తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఎండీగా ఐపీఎస్ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత టీఎస్ ఆర్టీసీలో సమూల మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. లాభాల బాటలోనూ సంస్థ ప్రయాణిస్తోంది. దీంతో ఆర్టీసీ ప్రజలకు మరింత చేరువయ్యింది. ప్రతీ సందర్భాన్ని కూడా బాగా వినియోగించుకునేలా సజ్జనార్ ప్లాన్ వేశారు. దీని సక్సెస్ కూడా అవుతూ వస్తోంది.