దాయాది పాకిస్తాన్ లో సంక్షోభం మరింత ముగిసింది. మొన్నటి వరకూ కేవలం ఆర్థిక పరంగానే సంక్షోభంలో మునిగింది. ఇప్పుడు ఆర్థికం, రాజకీయ సంక్షోభాలు పాకిస్తాన్ మెడకు చుట్టుకున్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసేందుకు అక్కడి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అయితే… ఇమ్రాన్ ఖాన్ మద్దతు దారుల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది. పోలీసులు, పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ కార్యకర్తలు పరస్పర దాడులకు దిగారు. దీంతో జమాన్ పార్క్ పెద్ద రణరంగంగా మారిపోయింది.
ఈ ఘర్షణలో 54 మంది రేంజర్లు గాయపడ్డారు. దీంతో ఇమ్రాన్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇమ్రాన్‌ను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారనే వదంతులు వ్యాపించడంతో దేశంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. పోలీసులు ఆందోళనకారులపై లాఠీఛార్జ్ చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటనల్లో అనేకమంది పీటీఐ కార్యకర్తలు గాయపడ్డారు.

పాకిస్తాన్ లో జరుగుతున్న సంఘటనలపై మాజీ ప్రధాని ఇమ్రాన్ స్పందించారు. తనను అపహరించి, హత్య చేయడమే అసలు ఉద్దేశమన్నారు. అరెస్ట్ అనేది ఓ డ్రామా మాత్రమేనని, వారి అరెస్ట్ ప్లాన్ లో ఏదో దురుద్దేశం దాగివుందని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. ఇదంతా లండన్ ప్రణాళికలో భాగమేనని, ఇమ్రాన్ ను జైల్లో పెట్టడానికి, పీటీఐని లేకుండా చేయడానికి ఇదో కుట్ర అంటూ విరుచుకుపడ్డారు. ష్యూరిటీ బాండ్ పై సంతకం చేసినా, పోలీసులు అంగీకరించలేదని, తాను 18 న కోర్టుకు వస్తానని హామీ ఇచ్చినా… ప్రజలపై దాడి చేశారని ఇమ్రాన్ మండిపడ్డారు.

తోష్‌ఖానా అంటే ఖజానా అని అర్థం. ఇది పాకిస్థాన్ ప్రభుత్వ శాఖ కేబినెట్ డివిజన్ పర్యవేక్షణలో ఇది పని చేస్తోంది. బహుమతి విలువ రూ.30,000 కన్నా తక్కువగా ఉంటే, పాకిస్థాన్ అధ్యక్షుడు లేదా ప్రధాన మంత్రి దానిని తన వద్ద ఉంచుకోవచ్చు. ఇంత కన్నా ఎక్కువ ఖరీదైన బహుమతులను తోష్‌ఖానాలో ఉంచాలి. ఇమ్రాన్ ఖాన్ ప్రధాన మంత్రిగా పని చేసిన కాలంలో ఖరీదైన బహుమతులను తోష్‌ఖానాకు అప్పగించలేదని ఆరోపణలు నమోదయ్యాయి. ఈ కేసులో ఇమ్రాన్‌ను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో ఆయన నివాసం వద్దకు పీటీఐ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.












