జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార రథం వారాహి రిజిస్ట్రేషన్ విషయంలో లైన్ క్లియర్ అయ్యింది. పవన్ వాహనానికి అన్ని అనుమతులు ఉన్నాయని తెలంగాణ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అధికారులుస్పష్టం చేశారు. పవన్ ‘వారాహి’ వాహనానికి ఆర్టీఏ అధికారులు రిజిస్ట్రేషన్ నెంబర్‌ను కూడా కేటాయించారు. ‘వారాహి’ రిజిస్ట్రేషన్ నెంబర్ TS 13 EX 8384 అని అధికారులు పేర్కొన్నారు. ‘వారాహి’ కలర్ ఆలివ్ గ్రీన్ కాదని.. ఎమరాల్డ్ గ్రీన్ అని అధికారులు వివరణ ఇచ్చారు. వాహనం బాడీ తయారీకి సంబంధించిన సర్టిఫికేట్స్ ను పరిశీలించామని, అన్ని నిబంధనలు వున్నాయని స్పష్టం చేశారు.
వాహనం రిజిస్ట్రేషన్ కోసం చట్ట ప్రకారం ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో రిజిస్ట్రేషన్ చేశామని తెలిపారు. పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం కోసం వినియోగించే వాహనం ఆర్మీ రంగులో వుందని, రిజిస్ట్రేషన్ కు సాధ్యమయ్యే పని కాదని మొదట వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని వివాదం రేపారు. ఇష్టం వచ్చినట్లు వాహనాలను వాడడానికి ఇది సినిమా కాదన్నారు. వాహనాల్లో పనికొస్తాయి కానీ… రాజకీయాల్లోకి సూట్ కావంటూ సెటైర్లు వేశారు.







