ఇండియా, ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ టిక్కెట్ల అంశం తమకు సంబంధం లేదని హెచ్ సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ స్పష్టం చేశారు. బ్లాక్ లో టిక్కెట్లు అమ్మడం నిజం కాదని, ఒకవేళ అది నిజమైతే.. పోలీసులు చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. ఇక… టిక్కెట్ల విషయంలో జరిగిన తొక్కిసలాటకు తమకు సంబంధం లేదన్నారు. టిక్కెట్స్ విక్రయాల బాధ్యతను తాము పూర్తిగా పేటీఎంకే అప్పగించామని అన్నారు. ఇలా అప్పజెప్పిన తర్వాత… మాకు సంబంధం ఏముంటుందని ఎదురు ప్రశ్నించారు.

 

 

ఒకవేళ… తొక్కిసలాట జరిగిన ఘటనపై పోలీసులు తమపై కేసులు నమోదు చేస్తే… తాము ప్రతిగా పేటీఎంపై కేసులు నమోదు చేస్తామని అజారుద్దీన్ సంచలన ప్రకటన చేశారు. ఒకవేళ తొక్కిసలాటలో తన తప్పు వుంటే.. తనను అరెస్ట్ చేసుకోవచ్చన్నారు. అయితే.. తొక్కిసలాటలో గాయపడిన వారికి అండగా వుంటామన్నారు. అయితే.. కాంప్లిమెంటరీ టిక్కెట్లు భారీగానే ఇచ్చామని, మిగతా టిక్కెట్లు ఆన్ లైన్లో అమ్ముడుపోయాయని తెలిపారు. సెప్టెంబర్ 15 న ఆన్ లైన్ ద్వారా 14,450 టిక్కెట్లు, కార్పొరేట్ బాక్స్ ద్వారా 4000, జింఖానాలో 21000, ఇంటర్నల్ గా 6000 టిక్కెట్లు విక్రయించామని వివరణ ఇచ్చారు.