ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నిర్వహించిన మన్ కీ బాత్ లో తెలుగు వారి గురించి ప్రస్తావించారు. సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా దేశభక్తి గీతాలు, ముగ్గులు, లాలి పాటలపై దేశ వ్యాప్తంగా నిర్వహించిన పోటీల విజేతలను ప్రకటించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ కి చెందిన టి. విజయదుర్గను విజేతగా ప్రకటించారు. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్ఫూర్తితో ఆమె దేశభక్తి గీతాన్ని రచించారని మోదీ పేర్కొన్నారు. రేనాడ ప్రాంత వీరా… ఓ నరసింహా… స్వాతంత్ర్య పోరాటానికి అంకురానివి… అంకుశానివి అంటూ మోదీ దీనిని వినిపించారు. తాటిచెర్ల విజయదుర్గ.  నంద్యాల జిల్లా కోవెలకుంట్ల నివాసి. ఆమె రాసిన కవితా పంక్తులను చదివారు. తన ప్రాంతంలోని తొలితరం స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి నుంచి ఆమె ప్రేరణ పొందారని అభినందించారు.

విజయదుర్గ  రాసిన గీతం.. 

రేనాటి సూర్యుడూ.. వీరనరసింహుడా…
భారత స్వాతంత్ర్య సమరపు అంకురానివి నీవురా..
అంకుశానివి నీవురా..
తెల్లదొరల నీతిలేని నిరంకుశపు దమనకాండకు..
సలసలమని మరిగిననీ నెత్తుటి ఎర్రని కాకలు..
రేనాటి సూర్యుడా.. వీరనసింహుడా..  

 

అలాగే… తెలంగాణకు చెందిన పేరిణి రాజ్ కుమార్ ను కూడా మోదీ అభినందించారు. కాకతీయుల కాలంలో శివుడికి అంకితం చేసిన పేరిణి నాట్యం ఎంతో ప్రఖ్యాతమైందన్నారు. రాజ్ కుమార్ ఒడిశా నాట్యంలోనూ గుర్తింపు పొందారని అన్నారు. ఇక… వి. దుర్గాదేవి అనే మహిళ కరకట్టం అనే పురాతన నృత్యంలో అవార్డు పొందారని మోదీ గుర్తు చేవారు.