ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి నెలా నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమం దేశానికి ఓ ఆశాదీపమని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాజకీయాలకు అతీతంగా మోదీ దేశానికి సందేశమిస్తున్నారని, ఈ కార్యక్రమం ద్వారా దేశం నలుమూలలా వున్న వ్యక్తులను కూడా పరిచయం చేస్తున్నారని అన్నారు. మన్ కీ బాత్ 100 కాఫీ టేబుల్ బుక్ ను ఉప రాష్ట్రపతి ధన్కర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ కార్యక్రమం అనేక సమస్యలను కవర్ చేసిందని, దేశంలో వున్న నాగరికతను కూడా ప్రతిబింబింపజేసిందన్నారు.
దేశంలోని ప్రతి ప్రాంతానికి ఈ కార్యక్రమం చేరిందని, దీని ద్వారా రేడియోకి కొత్త రూపం ఇచ్చినట్లైందని వివరించారు. ఇక.. భారత్ లో వున్నంత భావ ప్రకటన స్వేచ్ఛ ఎక్కడా లేదని అన్నారు. ప్రస్తుత పాలన ప్రజల గొంతును నొక్కేస్తోందంటూ సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ప్రజల గొంతును ఎవ్వరూ నొక్కలేరన్నారు. కొందరు విదేశాలకు వెళ్లి, మన దేశాన్ని తూలనాడుతున్నారని మండిపడ్డారు.