ఖలిస్థాన్ మద్దతుదారుడు అమృత్‌పాల్ గురించి కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఖలిస్థాన్ ఉగ్రవాది జర్నైల్‌సింగ్ భింద్రన్‌వాలేలా కనిపించేందుకు అతడు జార్జియాలో కంటి శస్త్రచికిత్స చేయించుకున్నట్టు తెలిసింది. ఈ మేరకు నిఘా వర్గాలు తెలిపాయి. అమృత్‌పాల్ అనుచరులపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదుచేసి విచారిస్తున్న సంగతి తెలిసిందే. వారే అధికారులకు ఈ విషయం వెల్లడించినట్టు సమాచారం. మరోవైపు, అమృత్‌పాల్ కోసం పంజాబ్ పోలీసుల వేట కొనసాగుతున్నది. ఈ నెల 14 వరకు ఎవరూ సెలవు పెట్టకూడదని ఆదేశాలు జారీ అయ్యాయి.
ఖలిస్థాన్ వేర్పాటు వాది అమృత్‌పాల్ సింగ్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. పంజాబ్ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు జల్లెడు పడుతున్నప్పటికీ అతని ఆచూకీ దొరడం లేదు. పైగా వరుస వీడియోలు విడుదల చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నాడు. రకరకాల మారు వేషాల్లో తిరుగుతూ పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. తాజాగా అమృత్ పాల్‌సింగ్ ఓ వీడియోను విడుదల చేశాడు. ఈ నెలలో సిక్కులు సమావేశం కావాలని సూచించాడు. అంతేకాదు, నేను ఎక్కడికి పారిపోలేదని, త్వరలోనే ప్రపంచం ముందుకు వస్తానని చెప్పారు.
ఈనెల 14న పంజాబీలకు కీలకమైన సర్‌బత్ ఖల్సా కార్యక్రమం జరగనుంది. ఆరోజు ఆకల్ తక్త్ సంస్థ ఆధ్వర్యంలో వేడుకలు జరగనున్నాయి. పైగా ఈ వేడుకలు చేయాలని అమృత్‌పాల్ సింగ్ స్వయంగా సూచించాడు. అయితే, ఆ రోజు పోలీసులకు లొంగిపోతాడనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. అన్ని ప్రాంతాల్లో అప్పటి వరకు నిఘాను మరింత పెంచారు. అమృత్ పాల్ లొంగిపోకముందు పట్టుకోవాలని పంజాబ్‌లోని ప్రతీ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నాడు. ఈ క్రమంలో ఈనెల 14 వరకు అందరికీ సెలవులు రద్దు చేస్తూ పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు. గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఆపీసర్లతో పాటు పోలీస్ సిబ్బంది ఎవరికి 14 వరకు సెలువులు లేవని, సెలవులో ఉన్నవారు విధుల్లో చేరాలని పంజాబ్ డీజీపీ స్పష్టం చేశారు.