బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సమితి అని మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. ఒక్క తెలంగాణలోనే అన్నదాతకు.. పెట్టుబడికి రూ.10 వేలు, పంట నష్టపోతే రూ.10 వేలు ఇస్తున్నామని చెప్పారు. అందుకే ఒక్క కేసీఆర్ సారు ఉంటే చాలు.. తమకు అదే పదివేలు అని రైతుల మనోగమతమని తెలిపారు. వేరేటోళ్లను పొరపాటున నమ్మినా.. తెలంగాణ మళ్లీ వందేళ్లు వెనక్కి వెళ్తుందని చెప్పారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

అకాల వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించిన విషయం తెలిసిందే. గురువారం వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి సీఎం పర్యటించారు. ఈ సందర్భంగా సాధారణ రైతులతోపాటు కౌలు రైతులకూ పరిహారం అందిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

 

ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. పంట నష్టంపై రైతులను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఎంత పంట వేశారు..ఎంత పెట్టుబడి పెట్టారని ఆరా తీశారు. ఈ సందర్భంగా రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పంట దెబ్బతిన్న రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రకటించారు. నష్టపోయిన రైతుకు ఎకరాకు 10 వేల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు. గంటలో ఈ నిధులను విడుదల చేస్తామని తెలిపారు.

 

ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి రైతు సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని, దానివల్ల వ్యవసాయం ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుని రైతులు స్థిరపడే పరిస్థితికి వస్తున్నారని తెలిపారు. అప్పుల నుంచి కూడా తేరుకుంటున్నారని తెలిపారు.  వ్యవసాయం దండగ అని చెప్పే మూర్ఖులు ఇప్పటికీ చాలామంది ఉన్నారని, ఈ మాటలు చెప్పేవాళ్లలో ఆర్థికవేత్తలు కూడా ఉన్నారని మండిపడ్డారు.  కానీ తాము గర్వంగా చెబుతున్నామని,  ఇవాళ తెలంగాణ భారతదేశంలోనే నంబర్‌వన్‌గా ఉందని ప్రకటించారు.