వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం విపక్షాలను ఐక్యం చేసే దిశగా మరో కీలక ముందడుగు పడింది. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు సంఘటితమవ్వాలని కాంగ్రెస్, జనతాదళ్ యునైటెడ్, రాష్ట్రీయ జనతాదళ్ అగ్రనేతలు సంకల్పం తీసుకున్నారు. బిహార్ లో మహా ఘటబంధన్ భాగస్వామ్య పక్షాల అధినేతలు, ముఖ్య నేతల సమావేశం జరిగింది. బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ నివాసంలో జరిగిన ఈ భేటీకి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, బిహార్ సీఎం నితీశ్, తదితరులు హాజరయ్యారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎలా నిలువరించాలి? అన్న దానిపైనే ప్రధానంగా చర్చించారు.
తమ మధ్య వున్న విభేదాలను పక్కన పెట్టి, కలిసి కట్టుగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నామని మీడియా సమావేశంలో తెలిపారు. అయితే… ఈ విపక్ష కూటమికి ఎవరు సారథి అని విలేకరులుగా ప్రశ్నించగా… ఎప్పటి లాగే చల్లగా జారుకున్నారు. ఇక… కూటమిలోకి రావాలని డీఎంకే, ఎన్సీపీతో కాంగ్రెస్ నేతలు చర్చించాలని.. టీఎంసీ, ఆప్, బీఆర్‌ఎస్ తదితరపార్టీల అధినేతలతో నితీశ్ కుమార్ చర్చించాలని ప్రధానంగా నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇదే విషయంపై ఖర్గే అంతకుముందు డీఎంకే చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేలతో కూడా మాట్లాడారు.
విపక్షాల ఐక్యత విషయంలో నితీష్ కుమార్ సైతం తమతో ఏకీభవించారని ఖర్గే ఈ సందర్భంగా పేర్కొన్నారు. విపక్ష నేతలతో జరిగిన సమావేశం చారిత్రాత్మకమని, ఈ ప్రక్రియ కొనసాగుతుందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. విపక్ష పార్టీలను ఏకం చేసే దిశగా ఇది కీలక భేటీ అన్నారు. సైద్ధాంతిక పోరాటంలో అన్ని పార్టీలను కలుపుకుని వెళతామని, వ్యవస్ధలపై జరిగే దాడులను ఐక్యంగా ప్రతిఘటిస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.