బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ఆరోపణలపై వరంగల్ సీపీ రంగనాథ్ స్పందించారు. బండి సంజయ్ తో తనకు ఎలాంటి గట్టు పంచాయతీలు లేవన్నారు. తన కెరీర్లో ఒక్క దందా చేసినా..సెటిల్ మెంట్ చేసినట్లు నిరూపించినా ఉద్యోగాన్ని వదిలిపెట్టి వెళ్లిపోతానని అన్నారు. పదో తరగతి పేపర్ మాల్ ప్రాక్టీస్ కేసులో చాలామంది మెసేజ్ పంపారని..వారందరిని విచారణకు పిలుస్తున్నామన్నారు. మీడియా వాళ్ళను కూడా విచారణకు పిలుస్తున్నామని చెప్పారు. నల్గొండ, ఖమ్మంతో పాటు..ఏపీలో అనేక ప్రాంతాల్లో డ్యూటీ చేశానని, ఎక్కడ చేసినా.. ప్రజలు గుర్తుపెట్టుకుంటారని అన్నారు.

 

ఈ కేసులో కూడా ప్రమాణం చేయాలంటే చేస్తామని, సమస్యలపై తన వద్దకు వచ్చిన వారిని ఎలాంటి భేదాలు చూపకుండా న్యాయం చేస్తానని వివరించారు. తన ఉద్యోగ ధర్మం తాను నిర్వర్తించేలా వుండాలన్నారు. తాను సెటిల్మెంట్లు చేసినట్లు ఆరోపించారని, అది నిరూపిస్తే తన సీపీ పదవికి రాజీనామా చేస్తానని రంగనాథ్ స్పష్టం చేశారు. బీజేపీ వాళ్లపై తప్పుడు కేసులు పెట్టాలన్న ఉద్దేశం తనకులేదని, రాజకీయాలకు అతీతంగానే పనిచేస్తున్నానని వివరణ ఇచ్చారు. పదో తరగతి పేపర్ మాల్ ప్రాక్టీస్ కేసులో చాలామంది మెసేజ్ పంపారని..వారందరిని విచారణకు పిలుస్తున్నామన్నారు. మీడియా వాళ్ళను కూడా విచారణకు పిలుస్తున్నామని చెప్పారు. సత్యం బాబు కేసుపై బండి సంజయ్ కు పూర్తి అవగాహన లేనట్లుందని అన్నారు. ఆ కేసును దర్యాప్తు చేసింది తాను కాదని సీపీ రంగనాథ్ అన్నారు.