ఖతార్ వేదికగా అర్జెంటీనా ఖతర్నాక్ ఆట ఆడింది. ఫైనల్ మ్యాచ్ లో ఫ్రాన్స్ ను ఓడించి, అర్జెంటీనా కప్పును సొంతం చేసుకుంది. ఇలా అర్జెంటీనా కప్పును స్వాధీనం చేసుకోవడం ఇది మూడోసారి. ఫైనల్లో పెనాల్టీ షూటౌట్ లో 4-2 తో అర్జెంటీనా విజేతగా నిలిచింది. కిక్కిరిసిన లూసైల్ స్టేడియంలో ఉత్కంఠతగా సాగిన ఫైనల్లో ఫ్రాన్స్ ను ఓడించి, అర్జెంటీనా ఛాంపియన్ గా నిలిచింది. దీంతో అభిమానులు పెద్ద సంబరాలు చేసుకున్నారు. నిర్ణీత టైమ్‌లో ఇరు జట్లూ సమంగా 2–2తో నిలవగా.. ఎక్స్‌ట్రా టైమ్‌లో స్కోరు 3–3గా మారింది. అర్జెంటీనా తరఫున లియోనల్ మెస్సీ 23, 108వ నిమిషాల్లో రెండు గోల్స్ కొట్టగా, అంగెల్ డి మరియా 36వ నిమిషంలో మరో గోల్ రాబట్టాడు.
మ్యాచ్ మొదలైనప్పటి నుంచే అర్జెంటీనా దూకుడుగా ఆడింది. బాల్‌ను ఎక్కువగా తమ కంట్రోల్‌లోకి తెచ్చుకుంది. ఆరంభంలోనే ఇలా దూకుడు చూపెట్టిన మెస్సీసేనను అడ్డుకునేందుకు ఫ్రాన్స్ డిఫెడంర్లు కష్టపడాల్సి వచ్చింది. అయితే.. ఫ్రాన్స్ సూపర్ స్టార్ కిలియన్ ఎంబాపె 80, 81, 118వ నిమిషాల్లో హ్యాట్రిక్ గోల్స్‌తో విజృంభించాడు. విజేతను తేల్చేందుకు షూటౌట్ నిర్వహించగా.. మెస్సీతో సహా నలుగురు అర్జెంటీనాకు గోల్స్ అందించారు.