ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్ వస్తే తాము గజ మాలతో సన్మానం చేస్తామని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. మోదీ సభకు కేసీఆర్ గనక రాకపోతే… తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతాడని బండి సంజయ్ హెచ్చరించారు. ప్రశ్నాపత్రం బయటకు వచ్చిన ఘటనలో కమలాపూర్ ఎంజేపీ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థిని అయిదేళ్ల పాటు డిబార్ చేసినట్లు సోషల్ మీడియాలో చూశానని, అన్ని పరీక్షలు బాగా రాసి, మంచిగా చదువుకునే విద్యార్థిని డిబార్ చేయడం దారుణమని మండిపడ్డారు.

బెదిరించి తన వద్ద పేపర్ లాక్కున్నారని బాలుడు చెబుతున్నాడని, అలాంటప్పుడు పరీక్షా కేంద్రం వద్ద కాపలాగా వున్న పోలీసులు ఏం చేస్తున్నారు? స్క్వాడ్ లు ఏమయ్యారు? అని ప్రశ్నించారు. రాజకీయ కక్షతో విద్యార్థి భవిష్యత్తు నాశనం చేయడం తగదన్నారు. వెంటనే విద్యార్థితో పరీక్షలు రాయించి, అతని చదువు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోందన్నారు.

తెలంగాణలో జంగిల్ రాజ్ పాలన నడుస్తోందని బీజేపీ స్టేట్ ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకూ పోరాడతామని స్పష్టం చేశారు. సంజయ్ ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఫైర్ అయ్యారు. కొంతమంది పోలీస్ అధికారులు సీఎం కేసీఆర్ చేతిలో బందీలుగా మారారని విమర్శించారు. కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతూ ఆయన చెప్పినట్లు ఆడుతున్నారన్నారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబానికి గులాంగిరీ చేయొద్దని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.