ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8 న హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. అదే రోజు భారీ ధర్నాకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. సింగరేణి ప్రైవేటీకరణ ప్రయత్నాలకు నిరసనగా మంచిర్యాల, భూపాలపల్లి,కొత్తగూడెం, రామగుండం సింగరేణి ప్రాంతాల్లో అదే రోజు మహాధర్నాలు నిర్వహించాలని మంత్రి కేటీఆర్ శ్రేణులకు పిలుపునిచ్చారు. సింగరేణిని ప్రయివేటీకరించబోమని రామగుండంలో ప్రధాని మోదీ మాట ఇచ్చి తప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. లాభాల్లో ఉన్న సిగరేణిని ప్రయివేటీకరించాల్సిన అవసరం ఏమొచ్చింది? అని ప్రశ్నించారు.
వేలం లేకుండా సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్న సీఎం కేసీఆర్ సంకల్పాన్ని దెబ్బతీసేందుకే కేంద్రం కుట్ర చేస్తుందని మండిపడ్డారు. తెలంగాణకు సింగరేణి ఓ ఆర్థిక, సామాజిక జీవనాడి లాంటిందని పేర్కొన్నారు. సింగరేణి ప్రయివేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గకుంటే జంగ్ సైరన్ మోగిస్తాం.. మరో ప్రజా ఉద్యమం నిర్మిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.