టీఎస్ పీఎస్సీ పరీక్షా పేపర్ లీకేజీ వ్యవహారం ఇప్పుడు తెలంగాణను కుదిపేస్తోంది. లీకేజీపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు లీకేజీ వ్యవహారంలో పోలీసులు అరెస్ట్ చేసిన 9 మంది నిందితులను నాంపల్లి కోర్టులో న్యాయవాది ఎదుట హాజరుపరిచారు. వాదనలు విన్న న్యాయమూర్తి 9 మంది నిందితులకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో నిందితులను చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు. మరోవైపు కీలక నిందితుడు ప్రవీణ్ ఎగ్జామ్ కూడా రాసేసినట్లు వెలుగులోకి వచ్చింది. అతనికి 103 మార్కులు వచ్చినట్లు పోలీసుల ఫిర్యాదులో వెల్లడైంది.
మరోవైపు కీలక నిందితుడు ప్రవీణ్ కి యువతులతో ఎక్కువ సంబంధాలున్నాయని పోలీసులు తేల్చేశారు. 2017 లో TSPSC లో జూనియర్ అసిస్టెంట్ గా చేరి, 4 సంవత్సరాల పాటు వెరిఫికేషన్ సెక్షన్ లో చేరాడు. ఈ సమయంలోనే మహిళలతో ఎక్కువ సంబంధాలు పెట్టుకున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. మరోవైపు మహబూబ్ నగర్ జిల్లా దగ్గర్లో ఈ పేపర్ లీకైనట్లు పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే… ఆ ప్రాంతంలో ఎవరెవరు పేపర్లు తీసుకున్నారన్న విషయాన్ని బయటికి తెచ్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
పేపర్ లీకేజ్‌కు సంబంధించి ప్రవీణ్‌ను ఓ యువతి హనీట్రాప్ చేసిందని, అతడిని రోజు ఆఫీస్‌కు వచ్చి కలిసేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. అతడి వలలో పడిన ప్రవీణ్.. ఆమె కోసం పేపర్ లీక్ చేసినట్లు విచారణలో బయటపడింది. యువతి ద్వారా అభ్యర్థులతో రూ.10 లక్షలకు ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. పేపర్ లీకేజీ వ్యవహారాన్ని హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షలన్నీ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్నారు.