ఇటీవలే బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మొదటి సారిగా ఏపీకి వచ్చారు. ఈ సందర్భంగా ఏపీలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, ఇతర నేతలు సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. పదవులు ఆశించి తాను బీజేపీలో చేరలేదన్నారు. తన సేవలు పార్టీకి ఎక్కడ అవసరమైతే.. అక్కడ పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించారు.
ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలూ తనవేనని పునరుద్ఘాటించారు. హైదరాబాద్ లోనే పుట్టానని, అక్కడే చదువుకున్నట్లు పేర్కొన్నారు. అక్కడే వుంటున్నానని కూడా గుర్తు చేశారు. తన తండ్రి సొంతూరు చిత్తూరు జిల్లా అని, వాయల్పాడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. బెంగళూరులోనూ తనకు ఇల్లువుందని, కర్నాటక కూడా స్వస్థలమే అవుతుందని ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఎక్కడ పనిచేయమంటే అక్కడ చేస్తానని, పదవులు వాతంటవే వస్తాయన్నారు. ఎన్నికల్లో టిక్కెట్ ఆశించడం లేదని, పోటీపై అధిష్ఠానానిదే ఫైనల్ అని స్పష్టం చేశారు.
అధిష్ఠానం తీసుకున్న అస్తవ్యస్త విధానాలతో కాంగ్రెస్ బాగా దెబ్బతిన్నదని, ఒక్కో రాష్ట్రంలో పార్టీ బలహీనపడిందని విమర్శించారు. 1984లో దేశంలో బీజేపీకి రెండు సీట్లు ఉంటే.. . కాంగ్రెస్‌కి 404 సీట్లు. 2014లో ఏడు శాతం నుంచి31శాతం బీజేపీకి ప్రజా మద్దతు పెరిగింది. కాంగ్రెస్‌కి 19.3శాతం 44 సీట్లు వచ్చాయి. 2019లో బీజేపీకి 303, కాంగ్రెస్‌కి 52 సీట్లు వచ్చాయి.
ఎన్నికలలో గెలుపు, ఓటమి సహజం అయినా… పరిస్థితి బట్టి నిర్ణయాలు ఉండాలి. ప్రజల మధ్యన నేను ఉండాలా లేదా అని ఆలోచించా. కాంగ్రెస్ వల్ల ప్రజలకు చేరువ కాలేనని అర్ధం అయ్యింది. బీజేపీలో ఉంటే ప్రజలకు దగ్గర కావచ్చనే నేను చేరాను. అసలు ప్రభుత్వం ఉందా లేదా అనేది త్వరలోనే మాట్లాడతానని అన్నారు. అన్ని ప్రాంతీయ పార్టీల తీరు పైనా అప్పుడు స్పందిస్తానని కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.