సిటీలోని ఎన్టీఆర్ మార్గ్ లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. అంబేద్కర్ కి నివాళులు అర్పించేందుకు హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించనున్నారు. గులాబీలు, పువ్వులు, తమలపాకులతో అల్లిన భారీ పూలమాలను రూపొందించారు. 125 అడుగుల విగ్రహానికి అలంకరించేందుకు ఓ భారీ క్రేన్ ను కూడా సిద్ధం చేశారు. ఈ కార్యక్రమం అంతా బౌద్ధ సంప్రదాయం ప్రకారం జరగనుంది. అంబేద్కర్ మునిమనుమడ ప్రకాష్ అంబేద్కర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహ రూపశిల్పి రామ్ వంజీ సుతార్ ను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించనుంది. ఈ విగ్రహావిష్కరణ సభకు సచివాలయ సిబ్బంది అధికారుల, జిల్లా కలెక్టర్లు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 300 మంది చొప్పున మొత్తం 119 నియోజకవర్గాల నుంచి 35,700 మంది హాజరవుతున్నారు.

 

ఈ కార్యక్రమం సందర్భంగా ప్రజలను తరలించేందుకు 750 ఆర్టీసీ బస్సులను కూడా ప్రభుత్వం బుక్ చేసింది. ఇక.. ఎండాకాలం కావడంతో సభకు హాజరయ్యే వారికి ఇబ్బందులు కాకుండా లక్షన్నర మజ్జిగ ప్యాకెట్లు, స్వీట్ ప్యాకెట్లు, లక్షన్నర వాటర్ ప్యాకెట్లను కూడా సిద్ధం చేశారు. అలాగే షామియానాలను కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 40 వేల కుర్చీలను కూడా ఏర్పాటు చేశారు. ఇక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. గాయకుడు సాయిచంద్, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ కార్యక్రమాలను రూపొందించారు.

కార్యక్రమ పూర్తి వివరాలివే..

సీఎం కేసీఆర్‌ మధ్యాహ్నం 2.30 గంటలకు అంబేద్కర్‌ విగ్రహం వద్దకు చేరుకొంటారు.
ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా పూలవర్షం కురిపిస్తూ అంబేద్కర్‌కు ఘనంగా పుష్పాంజలి ఘటిస్తారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రారంభోపన్యాసంతో సభ ప్రారంభం అవుతుంది. సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ముఖ్య అతిథి ప్రకాశ్‌ అంబేద్కర్ ప్రసంగిస్తారు.
అనంతరం జయంతి వేడుకలను ఉద్దేశించి సీఎం కేసీఆర్‌ సందేశం ఇస్తారు.
సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జా ధన్యవాద ప్రసంగంతో సాయంత్రం 5 గంటలకు సభ ముగుస్తుంది.