నేటి నుంచే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. మరి కాసేపట్లో ప్రారంభం

నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన పాల్గొంటున్న తొలి అధికారిక కార్యక్రమం కూడా ఇదే కావడం విశేషం. ఆ తర్వాత ఉభయ సభలూ మరుసటి రోజుకి వాయిదా పడనున్నాయి. ఈ కార్యక్రమాలు పూర్తైన తర్వాత స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. సమావేశాల అజెండాను ఖరారు చేయనున్నారు. అయితే… ఈ నెల 14 నుంచి 24 వరకూ సమావేశాలు నిర్వహించాలని వైసీపీ సర్కార్ ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే… దీనిపై బీఏసీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే ఇదే సమావేశాల్లో ఈ యేడాది బడ్జెట్ ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 17 న ప్రవేశపెట్టనున్నారు.

 

మరో వైపు ప్రతిపక్ష టీడీపీ నేతలు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమైపోయారు. 20 అంశాలను ప్రతిపాదికగా తీసుకొని, వాటిపై ప్రభుత్వాన్ని నిలదీయాలని రెడీ అయ్యింది. విద్యుత్ చార్జీల పెంపు, పోలవరం, నిరుద్యోగం, రైతు సమస్యలు, అక్రమ కేసులపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు రెడీ అయ్యారు. ఉదయం 9 గంటలకు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి శాసన సభ సమావేశానికి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లనున్నారు. ప్రజా సమస్యలపై సభలో చర్చకు పట్టుబట్టాలని తెలుగు దేశం పార్టీ నిర్ణయించింది. కనీసం 20 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు జరగాలని టీడీపీ డిమాండ్ చేసింది.

Related Posts

Latest News Updates