ద్వేషపూరిత ప్రసంగం దేశ సెక్యులరిజాన్ని ప్రభావితం చేసే తీవ్రమైన నేరమని సుప్రీంకోర్టు తెలిపింది. ఇలాంటి ప్రసంగం చేసిన వ్యక్తి కులం, వర్గం, మతంతో సంబంధం లేకుండా చట్టాన్ని ఉల్లంఘించేందుకు ఎవరినీ అనుమతించబోమని కోర్టు స్పష్టం చేసింది. ద్వేషపూరిత ప్రసంగాలపై ఎవరూ ఫిర్యాదు చేయనప్పటికీ కేసులు నమోదు చేయాలని పేర్కొంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. 2022లో కేవలం మూడు రాష్ట్రాలకు వర్తించే తీర్పు పరిధిని శుక్రవారం ఈ మేరకు పొడిగించింది. ద్వేషపూరిత ప్రసంగాలపై కేసులు నమోదు చేయడంలో జాప్యం చేస్తే కోర్టు ధిక్కారంగా పరిగణిస్తామని కూడా సుప్రీంకోర్టు హెచ్చరించింది.