కేరళలో ప్రధాని నరేంద్ర మోదీ మొదటి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. రెండు రోజుల కేరళ పర్యటనలో భాగంగా మోదీ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తిరువనంతపురం నుంచి కాసరగోడ్ మధ్య ఈ వందే భారత్ రైలు నడుస్తుంది. మొత్తం 11 జిల్లాలను కవర్ చేస్తూ ఈ రైలు ప్రయాణిస్తుంది. వందే భారత్ రైలును ప్రారంభించగానే.. మోదీ వివిధ పాఠశాలల విద్యార్థులతో కలిసి అందులో ప్రయాణించారు. ఈ సందర్భంగా వారు గీచిన చిత్రాలను విద్యార్థులు ప్రధానికి బహూకరించారు. కాసేపు ముచ్చటించారు.ఇక.. వందేభారత్ రైలు ప్రారంభోత్సవంతో పాటు తిరువనంతపురంలోని డిజిటల్ సైన్స్ పార్క్ కి కూడా మోదీ శంకుస్థాపన చేశారు. ఇదే వేదికగా మరిన్ని ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్, గవర్నర్ ఆరిఫ్ అహ్మద్ ఖాన్, రైల్వే మంత్రి అశ్వనీ వైష్ఱవ్ తదితరులు పాల్గొన్నారు.
దేశంలోనే కేరళలో మొదటి సారిగా వాటర్ మెట్రో అందుబాటులోకి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం దీనిని ప్రారంభించారు. కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ దీని నిర్వాహణ బాధ్యతలను చూసుకుంటుంది. కొచ్చి వాటర్ మెట్రో సర్వీస్ లో బ్యాటరీ సాయంతో నడిచే 78 ఎలక్ట్రిక్ హైబ్రిడ్ బోట్లు వుంటాయి. వీటి కోసం 38 టెర్మినళ్లు నిర్మించారు. కొచ్చి చుట్టుపక్కల వుండే 10 ద్వీపాలను కలుపుతూ ఈ వాటర్ మెట్రో రాకపోకలు సాగిస్తుంది. మరోవైపు కేరళ ప్రజల కలల ప్రాజెక్ట్ నెరవేరిందని కేరళ సీఎం విజయన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ వాటర్ మెట్రో ప్రాజెక్టును 1,136.83 కోట్ల వ్యయంతో నిర్మించారు. కేరళ సర్కార్, జర్మనీకి చెందిన ఫండింగ్ సంస్థ KFW సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి. దీంతో పర్యావరణానికి హాని వుండదని, పూర్తిగా విద్యుత్ సాయంతో పనిచేస్తుంది.