మన దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఎవరు? ప్రతి రోజూ ప్రత్యర్థులు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటారు. ఆస్తుల చిట్టా చెప్పడానికి దమ్ముందా? ఎంత ఆస్తి వుందో వెల్లడించే ధైర్యం వుందా? అని రాజకీయ ప్రత్యర్థులు ఒకరిపై ఒకరు రోజూ సవాల్ చేసుకుంటారు. కానీ… ఏ ఒక్క నేత కూడా తన ఆస్తులు మాత్రం చెప్పరు. కానీ… తాజాగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ఓ నివేదిక బహిరంగ పరిచింది. ఈ రిపోర్టు ప్రకారం భారత దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తేలింది. 510 కోట్ల రూపాయల ఆస్తులతో రాష్ట్ర ప్రభుత్వాల సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ఇక… అరుణాచల్ ముఖ్యమంత్రి పెమా ఖండూ 163 కోట్ల ఆస్తులతో 2 వ స్థానంలో నిలిచారు.

 

మూడో స్థానంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నిలవగా.. ఆయన ఆస్తులు 63 కోట్లుగా వుంది. దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల ఉమ్మడిఆస్తి విలువ 1,018.86 కోట్లు కాగా, అందులో 50.09 శాతం ఆస్తులు ఒక్క ఏపీ సీఎం జగన్ మీదే వున్నాయి. ఇక… పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అందరి కంటే తక్కువగా 15 లక్షల ఆస్తులు కలిగి వున్నారు. ఇక… తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆస్తివిలువ 23.55 కోట్లు. ఇక.. బిహార్ సీఎం నితీశ్ కుమార్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆస్తి ఒక్కొక్కరి పేరిట 3 కోట్లకు పైగా ఆస్తి వుంది. తమిళనాడు సీఎం స్టాలిన్, కర్నాటక సీఎం బొమ్మై ఆస్తి ఒక్కొక్కరికి 8 కోట్లకు పైగా వుంది. ఇక… కేరళ సీఎం పినరయి ఆస్తి కోటి పైన, హర్యానా సీఎం ఖట్టర్ ఆస్తి విలువ కూడా కోటి పైనే వుంది.

 

ఒక్క మాటలో చెప్పాలంటే ఏపీ సీఎం, అరుణాచల్ సీఎం, ఒడిశా సీఎం అత్యంత ఎక్కువ ఆస్తి కలిగిన సీఎంల జాబితాలో చేరారు. బెంగాల్, కేరళ, హర్యానా ముఖ్యమంత్రులు తక్కువ ఆస్తి కలిగిన ముఖ్యమంత్రులుగా నిలిచారు. 30 మంది ముఖ్యమంత్రులలో గ్రాడ్యుయేషన్ విద్యార్హత కలిగిన వారు 11 మంది. పీజీ చేసిన వారు 9, గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ కోర్సు చేసినవారు నలుగురు వున్నారు. ఇక.. అప్పులు, కేసుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ అగ్రస్థానంలో నిలిచారు. కేసీఆర్ కి 8.88 కోట్లు మేర అప్పులున్నాయి. ఇక.. ఆయన మీద 64 కేసులు కూడా వున్నాయి.