తెలంగాణ కొత్త సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. దీనిలో భాగంగా యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. తదనంతరం సచివాలయంలోని 6 వ అంతస్తులోని తన ఛాంబర్ కి వెళ్లి, కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేస్తూ తొలి సంతకం చేశారు. ఇలా మొత్తం 6 ఫైళ్లపై సీఎం కేసీఆర్ సంతకాలు చేశారు. పోడు భూముల పంపిణీ, నగరంలో లక్ష బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ, గ్రుహ లక్ష్మీ సహా పలు ఫైళ్లపై కూడా సంతకాలు చేశారు. అనంతరం సమయంలో సీఎం కేసీఆర్​కు వేద పండితులు ఆశీర్వచనం అందించారు. అంతకు ముందు ఎలక్ట్రిక్​ వాహనంలో పలు ఛాంబర్​లను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయనకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, సచివాలయ ఉద్యోగులు, తదితరులు సీఎం ని అభినందించారు.

 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ అవతరణకు ముందు అనేక వాదోపవాదాలు, అనేక చర్చలు చూశామని, తెలంగాణ అవతరించిన తర్వాత కూడా పునర్నిర్మాణం కోసం అంకితభావంతో అడుగులు వేసే సందర్భంలో కొందరు అర్భకులు తెలంగాణ భావాన్ని, అర్థాన్ని, పునర్నిర్మాణ కాంక్షను జీర్ణించుకోలేని పిచ్చివాళ్లు కొందరు కారుకూతలు కూశారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం అంటే ఏంటీ? ఉన్నవాటిని కూలగొట్టి మళ్లీ కడతారా? మొత్తం తెలంగాణనే కూలగొట్టి మల్ల కడతారా? అని విపరీతమైనటువంటి, దుర్మార్గమైనటువంటి కురచ వ్యక్తులు, మరుగుజ్జులు చిల్లర వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం వేటినీ పట్టించుకోకుండా ఈ రోజు ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోయింది నా తెలంగాణ రాష్ట్రం గర్వంగా ప్రకటిస్తున్నానని అన్నారు.

తెలంగాణ ప‌రిపాల‌న‌కు గుండెకాయ‌గా, అత్యంత శోభాయ‌మానంగా నిర్మించిన స‌చివాల‌యం తన చేతుల మీదుగా ప్రారంభించ‌డం తన జీవితంలో దొరికిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నాని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. సచివాలయ నిర్మాణంలో అందరి కృషి ఉందని వెల్లడించారు. సచివాలయ తరహాలోనే తెలంగాణ పల్లెలు కూడా వెలిగిపోతున్నాయని చెప్పారు. పెద్ద పోరాటం త‌ర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. స‌మైక్య పాల‌న‌లో తెలంగాణ‌లో చాలా విధ్వంసం జ‌రిగిందన్నారు. వ్యవసాయానికి నీళ్లు వచ్చేవి కాదన్నారు. ప్లానింగ్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియాలో కూడా హైద‌రాబాద్ మిన‌హా అన్ని జిల్లాల‌ను వెనుక‌బ‌డిన జిల్లాల్లో చేర్చారని అన్నారు. ఈ రోజు తెలంగాణ సాధించిన ప్రగ‌తిలో ప్రతి ఒక్కరి కృషి ఇమిడి ఉందని, అనేక విభాగాలు క‌లిసి ప‌ని చేయ‌డం వ‌ల్లే ప్రగ‌తి సాధ్యమైందని చెప్పారు.