తెలంగాణ పదో తరగతి పరీక్షల్లో మరో ప్రశ్నాపత్రం లీకైంది. రెండో రోజు హిందీ పరీక్ష ప్రారంభమైన కాసేపటికే హిందీ పేపర్ వాట్సాప్ లో ప్రత్యక్షమైంది. అయితే ఉమ్మడి వరంగల్ నుంచే ఈ పేపర్ బయటికి వచ్చింది. ఉదయం 9:30 గంటలకే పేపర్ బయటి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో విద్యార్థుల తలిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హిందీ పేపర్ లీక్ పై వరంగల్ జిల్లా డీఈవో వాసంతి స్పందించారు. ఇవన్ని వదంతులే అని కొట్టిపారేశారు.దీనిపై పోలీస్ కమిషనర్ కు కంప్లయింట్ చేస్తామని తెలిపారు. పదో తరగతి హిందీ పరీక్ష పత్రం లీకేజీపై వస్తున్న వార్తలపై వరంగల్ డీఈవో, హనుమకొండ డీఈవోలు తక్షణమే విచారణ జరుపాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణలో పేపర్ లీకేజీల యుగం నడుస్తోంది. మొన్నటికి మొన్న TSPSC పేపర్ లీకేజీ అయ్యింది. దీనిపై ఇప్పటికీ నిరసన జరుగుతూనే వుంది. ఇది మరిచిపోకముందే టెన్త్ పేపర్ లీక్ అయ్యింది. ఈ వ్యవహారం ప్రజల మెదడులో నానుతుండగానే.. ఉట్నూరులో మరో ఘటన జరిగింది. ఉట్నూరు మండల కేంద్రంలో పదో తరగతి ఆన్సర్ షీట్ ల కట్ట మిస్సయ్యింది. తపాలా కార్యాలయం నుంచి ఉట్నూర్ బస్టాండ్ కి తీసుకొస్తున్న క్రమంలో ఆటోలో నుంచి మిస్సైనట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇలా 20 మంది విద్యార్థుల ఆన్సర్ షీట్లు కనిపించకుండా పోయాయి. పోస్టల్ అధికారి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం తెలిసొచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించారు.