వికారాబాద్ జిల్లా తాండూర్ లో పదో తరగతి పరీక్ష ప్రారంభమైన కొద్ది సేపటికే ప్రశ్నాపత్రం బయటకు వచ్చింది. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న బయో సైన్స్ ఉపాధ్యాయుడే పేపర్ బయటకు రావడానికి కారణమని పోలీసులు గుర్తించారు. దీంతో జిల్లా విద్యాధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బయో సైన్స్ ఉపాధ్యాయుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకొని, విచారిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా దీనిపై సీరియస్ అయ్యింది. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర విద్యాశాఖ జిల్లా కలెక్టర్ కి ఆదేశాలు జారీ చేసింది. పేపర్ లీకేజీ ఘటనలో ముగ్గురిపై సస్పెన్షన్ వేటు పడింది.
ఎగ్జామ్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్, మరొకరిపై వేటు వేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. ఇవాళ ఉదయం తెలుగు పరీక్ష ప్రారంభమైన ఏడు నిమిషాల్లోనే ప్రశ్నాపత్రం బయటకు వచ్చిందని, తాండూరులోని ప్రభుత్వ పాఠశాల-1 నుంచి బయటకు వచ్చినట్లు నిర్ధారించామని తెలిపారు. ఆ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుడు బందెప్ప వాట్సాప్ నుంచి ప్రశ్నాపత్రం బయటకు వచ్చినట్లు నిర్ధారించినట్లు తెలిపారు. ఆ ప్రశ్నాపత్రాన్ని ఓ ప్రయివేటు పాఠశాలలో పని చేస్తున్న టీచర్‌కు బందెప్ప పంపినట్లు పోలీసులు నిర్ధారించినట్లు పేర్కొన్నారు.