ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం ఆందోళన చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని, దీనిపై సీబీఐ, ఈడీలతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై విచారించాలని కోరారు.
అనంతరం వారు పార్లమెంట్ వైపు దూసుకు వెళ్లే ప్రయత్నం చేయగా అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైఎస్సార్టీపీ శ్రేణులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై జేపీసీ వేయాలని, కేంద్ర దర్యాప్తు సంస్థలచే విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్ చేశారు. వెంటనే షర్మిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు, కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. ‘కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో’ అంటూ నినాదాలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ వేల కోట్ల కమీషన్లు దండుకున్నారని ఆమె ఆరోపించారు. రీ డిజైనింగ్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టును మూడు రెట్లు వ్యయం పెంచారని చెప్పారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని మరోసారి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద స్కామ్ అని వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రజల సొమ్ము లక్షల కోట్లను కేసీఆర్ దోచుకున్నారని ఆరోపించారు.