చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయం…

ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా బుధవారం జరిగిన హోరాహోరీ పోరులో చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ 3 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం సాధించింది. తమ ఇలాఖాలో రాయల్స్‌పై ఆధిపత్యాన్ని కొనసాగిద్దామనుకున్న చెన్నైకి భంగపాటు ఎదురైంది. తొలుత జోస్‌ బట్లర్‌(52) అర్ధసెంచరీకి తోడు అశ్విన్‌(30), హెట్‌మైర్‌(30 నాటౌట్‌) రాణించడంతో రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 175/8 స్కోరు చేసింది. ఆకాశ్‌సింగ్‌, తుషార్‌ దేశ్‌పాండే, జడేజా రెండేసి వికెట్లు తీశారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన చెన్నై 172/6 స్కోరుకు పరిమితమైంది. ఓపెనర్‌ కాన్వె(50) అర్ధసెంచరీతో ఆకట్టుకోగా, ఆఖర్లో ధోనీ(17 బంతుల్లో 32 నాటౌట్‌, ఫోర్‌, 3 సిక్స్‌లు), జడేజా(15 బంతుల్లో 25 నాటౌట్‌, ఫోర్‌, 2 సిక్స్‌లు) తుదికంటా పోరాడారు. అశ్విన్‌, చాహల్‌ రెండేసి వికెట్లు తీయగా, ఆఖరి ఓవర్లో సందీప్‌శర్మ(1/30) అద్భుతం చేశాడు. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించిన లోకల్‌ హీరో అశ్విన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది.

ఆఖరి ఓవర్‌లో 21 రన్స్‌ అవసరం కాగా, ధోనీ, జడేజా క్రీజ్‌లో ఉన్నారు. సందీప్‌ వరుసగా రెండు వైడ్లు వేశాడు. ఆ తర్వాతి రెండు బంతులకు ధోనీ రెండు సిక్స్‌లు కొట్టడంతో సమీకరణం 3 బంతుల్లో 7 పరుగులుగా మారింది. అయితే నాలుగో బంతికి ధోనీ, ఐదో బంతికి జడేజా సింగిల్స్‌తో సరిపెట్టారు. దీంతో ఆఖరి బంతికి ఐదు పరుగులు చేయాల్సివుండగా, ధోనీ సింగిల్‌ మాత్రమే చేయగలిగాడు.

మెరుపులు మెరిపించిన ధోనీ…

42 సంవత్సరాలు వున్నా… మహేంద్ర సింగ్ ధోనీ చేవ మాత్రం అస్సలు తగ్గలేదు. ఇక.. గెలవలేమని తెలిసినా… జడేజాతో కలిసి గట్టి పోరాటమే చేశాడు. చివరి ఓవర్లో సంచలన షాట్లతో జట్టును విజయానికి అత్యంత చేరువగా తీసుకెళ్లాడు. కానీ… ఆఖరి మూడు బంతుల్లో సందీప్ శర్మ సూపర్ బాలింగ్ చేయడంతో రాజస్థాన్ రాయల్స్ కి విజయం వరించింది.

18వ ఓవర్లో మహీ 4, 6తో జట్టును రేసులోకి తెచ్చాడు. టార్గెట్‌‌ 12 బాల్స్‌‌లో 40గా మారగా.. 19వ ఓవర్లో జడ్డూ 4, 6, 6తో 19 రన్స్‌‌ రాబట్టాడు. సందీప్​ శర్మ వేసిన లాస్ట్​ ఓవర్లో మహీ 6, 6 కొట్టినా 17 రన్సే రావడంతో చెన్నై కొద్దిలో విజయం చేజార్చుకుంది.

రాజస్థాన్‌: 20 ఓవర్లలో 175/8(బట్లర్‌ 52, హెట్‌మైర్‌ 30 నాటౌట్‌, జడేజా 2/21, దేశ్‌పాండే 2/37), చెన్నై: 20 ఓవర్లలో 172/6(కాన్వె 50, ధోనీ 32 నాటౌట్‌, అశ్విన్‌ 2/25, చాహల్‌ 2/27)

 

Related Posts

Latest News Updates