ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన ఘోర ప్రమాదం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి స‌మీపంలో ఊహించని రీతిలో సిలిండర్లు పేలి ఇద్దరు కార్యకర్తలు మరణించడం, పలువురికి తీవ్ర గాయాల‌వ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. ఈ ఘ‌ట‌న గురించి తెలిసిన వెంటనే ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కు, ప్రమాదం జరిగిన ప్రాంతంలో వున్న ఎంపీ నామా నాగేశ్వర్ రావుకు ఫోన్లు చేసి ప్రమాదం వివరాలు తెలుసుకున్నారు. మరణించిన కార్యకర్తల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు. తాము అండగా వుంటామని స్పష్టం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలందించాలని వైద్యులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

 

ఖమ్మం జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి, 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన నేతలను ఆహ్వానించడానికి స్థానిక కార్యకర్తలు బాణాసంచా పేల్చారు. దీంతో పక్కనే వంటల కోసం ఏర్పాటు చేసిన గుడిసెలో వున్న సిలిండర్ పై నిప్పు రవ్వలు పడ్డాయి.

దీంతో సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ఒకరు మృతి చెందగా..10 మందికి గాయాలయ్యాయి. వీరిలో కొంత మంది పరిస్థితి విషమంగా వుందని, గాయపడ్డ వారిలో ఇద్దరు పోలీసులు, మరో ఇద్దరు పాత్రికేయులు కూడా వున్నారు. క్షతగాత్రులను పోలీసుల వాహనాల్లో ఖమ్మం తరలించారు. ఈ ఘటన జరగడంతో ఆత్మీయ సమ్మేళనం రద్దైంది. నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.