తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పై ఆర్థిక మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా ఏడు నెలలుగా గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆపారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కోర్టులకు వెళ్లి కేసులు వేస్తే తప్ప బిల్లులు పాస్ కానీ పరిస్థితి ఏర్పడిందని గవర్నర్‌పై మంత్రి మండిపడ్డారు. సుప్రీంకోర్టులో కేసు వేస్తే ఇవాళ రెండు మూడు బిల్లులు పాస్ చేశారు. బీజేపీ కుట్రలు చేస్తూ రాష్ట్ర ప్రగతిని ఎంతగా అడ్డుకుంటుందో గమనించాలన్నారు.
మంత్రులు కలిసి వివరించినా, గవర్నర్ బిల్లులను ఆమోదించడం లేదన్నారు. ఫారెస్ట్ యూనివర్శిటీ కోసం తీసుకొచ్చిన బిల్లును కేబినెట్ ఆమోదం కోసం పంపిస్తే… ఆ బిల్లును రాష్ట్రపతి వద్దకు గవర్నర్ పంపించారని, బిల్లులను ఆమోదించకపోవడం రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడమే అవుతుందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను గవర్నర్ దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా ఉద్యోగాలు ఇస్తామంటే, ఆ బిల్లును ఏడునెలల పాటు ఆపి ఇప్పుడు రాష్ట్రపతి పరిశీలనకు పంపారు. మా పిల్లలకు ప్రొఫెసర్లు చదువులు చెప్పొద్దా? అని నిలదీశారు. బీహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో అన్ని యూనివర్సిటీలకు కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డును 1961 నుంచే అమలు చేస్తున్నారని హరీశ్ రావు అన్నారు.
పెండింగ్ లో వున్న బిల్లుల విషయంలో తెలంగాణ గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పెండింగ్ లో వున్న 3 బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపారు. 2 బిల్లులను రాష్ట్రపతికి పంపారు. మరో 2 బిల్లులను తిప్పి పంపగా, మరో 2 బిల్లులను మాత్రం పెండింగ్ లో పెట్టేశారు. పెండింగ్ లో వున్న బిల్లుల విషయంలో నేడు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. చట్ట సభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్ర వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రబుత్వం పక్షాన సీఎస్ సుప్రీంలో ఈ పిటిషన్ దాఖలు చేశారు.
ప్రతివాదులుగా గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిని చేర్చారు. 200వ ఆర్టిక్ ప్రకారం గవర్నర్ బిల్లును ఆమోదించడం లేదా రాష్ట్రపతి పరిశీలనకు పంపాలని ప్రభుత్వం పిటిషన్ లో పేర్కొంది. నేడు గవర్నర్ మొత్తం 10 బిల్లులకు మూడింటిని మాత్రమే ఆమోద ముద్ర వేశారు.