తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్నిహంగులతో కొత్తగా సెక్రటేరియట్‌ను నిర్మించింది. ఈ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టింది. అయితే.. ప్రస్తుతం బూర్గుల రామకృష్ణ భవన్ నుంచి పనులు సాగుతున్నాయి. సచివాలయ నిర్మాణం పూర్తి కావడంతో కొత్త సచివాలయంలోకి అధికారులు శాఖలను తరలించనున్నారు. రేపటితో మొదలై.. ఈ నెల 28 వరకు తరలింపు కొనసాగనున్నది.
సచివాలయంలో ఒక్కో ఫ్లోర్‌ను మూడుశాఖలకు కేటాయించారు. గ్రౌండ్ ఫ్లోర్లో రెవెన్యూశాఖ, మొదటి ఫ్లోర్లో హోంశాఖ, రెండో అంతస్తులో ఆర్థికశాఖ, మూడో ఫ్లోర్లో వ్యవసాయం, ఎస్సీ డెవలప్మెంట్ శాఖలకు కేటాయించారు. నాలుగో అంతస్తులో నీటిపారుదలశాఖ, న్యాయశాఖలకు, ఐదో అంతస్తులో సాధారణ పరిపాలన శాఖ, ఆరో ఫ్లోర్లో సీఎం, సీఎస్‌లకు కేటాయించారు. లోవర్ గ్రౌండ్ ఫ్లోర్లో స్టోర్స్, రికార్డ్ రూమ్‌లు, వివిధ సేవలకు సంబంధించిన ఆఫీసులను ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నెల 30న సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అదే రోజు ఉదయం కొత్త సచివాలయం ప్రాంగణంలో సుదర్శన యాగం నిర్వహించనుండగా.. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.