కొత్త అనుభూతిని పంచుతూ అందరినీ మెప్పించే చిత్రం ‘టిల్లు స్క్వేర్’ : చిత్ర దర్శకుడు మల్లిక్ రామ్

తెలుగునాట యువతలో కల్ట్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సినిమాలలో ‘డీజే టిల్లు’ ఒకటి. టిల్లుగా స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ పంచిన వినోదాన్ని ప్రేక్షకులు అంత తేలికగా మరిచిపోలేరు. టిల్లు మాటలు, చేష్టలు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఇప్పుడు ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్‌ గా ‘టిల్లు స్క్వేర్’ వస్తోంది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌

పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.‌ శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా దర్శకుడు మల్లిక్ రామ్ మీడియాతో ముచ్చటించి చిత్ర విశేషాలను పంచుకున్నారు.

టిల్లు స్క్వేర్ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు?

సిద్ధుతో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. దాదాపు ఇద్దరం ఒకేసారి సినీ ప్రయాణం మొదలుపెట్టాం. మేమిద్దరం కలిసి సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. నా మొదటి సినిమా నరుడా డోనరుడా. ఆ తర్వాత అద్భుతం అనే సినిమా చేశాను. మధ్యలో పెళ్లి గోల అనే వెబ్ సిరీస్ కూడా చేశాను. అది చాలా పెద్ద హిట్ అయింది. డీజే టిల్లు, అద్భుతం సినిమాలు ఇంచుమించు ఒకే సమయంలో వచ్చాయి. ఆ తర్వాత నేను, సిద్ధు కలిసి ఒక సినిమా చేయాలి అనుకున్నాం. అదే సమయంలో నాగవంశీ గారు ‘టిల్లు స్క్వేర్’ చేస్తే బాగుంటుందని చెప్పడం, డీజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణ ఇతర కమిట్ మెంట్స్ తో బిజీగా ఉండటంతో నేను ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చాను. మొదట కాస్త సంకోచించాను కానీ కథ బాగా వచ్చేసరికి ఇక వెనకడుగు వేయలేదు.

డీజే టిల్లు అనేది వేరొకరు సృష్టించిన పాత్ర. పైగా దర్శకుడు కంటే కథానాయకుడికే ఎక్కువ పేరు వచ్చింది. మీరు సీక్వెల్ అంగీకరించే ముందు ఆ కోణంలో ఆలోచించారా?

అద్భుతం సినిమాకి కూడా కథ నాది కాదు. ప్రశాంత్ వర్మ ఇచ్చిన కథకు నేను దర్శకత్వం వహించాను. నరుడా డోనరుడా కూడా రీమేక్. నాకు ఆ కథ బాగా నచ్చి చేశాను. నేను కథలు రాయగలను.. అలాగే ఇతరులు రాసిన కథలను తెరకెక్కించి వాటికి న్యాయం చేయగలను. అలాగే సిద్ధుకి పేరు వస్తుందంటే నాకు ఆనందమే. ఎందుకంటే నేను, సిద్ధు, ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా మేమంతా ఈ స్థాయికి రావడం కోసం దాదాపు 12 ఏళ్లుగా కష్టపడుతున్నాం. ఇప్పుడు కలిసి సినిమాలు చేస్తున్నాం. కాబట్టి ఎవరికి క్రెడిట్ వచ్చినా సంతోషమే.

సినిమాలో సిద్ధు ప్రమేయం ఎంతవరకు ఉంటుంది?

బయట ఏవో కొన్ని వార్తలు వస్తుంటాయి కానీ వాటిలో వాస్తవం లేదు. సిద్ధు ఒక రచయితగా, నటుడిగా ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలో.. అంతవరకే ఇన్వాల్వ్ అవుతాడు. దర్శకుడికి ఇవ్వాల్సిన స్వేచ్ఛను దర్శకుడికి ఇస్తాడు. ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఇద్దరం చర్చించుకొని చేశాం. కథా చర్చల సమయంలో ఒక రచయితగా వ్యవహరిస్తాడు. చిత్రీకరణ సమయంలో ఒక నటుడిగా ఏం చేయాలో అది చేస్తాడు. ఈ సినిమా కోసం సిద్ధుతో కలిసి రెండేళ్లు ట్రావెల్ చేశా. ఇద్దరం కలిసి సమన్వయంలో ఈ సినిమా చేశాం. డీజే టిల్లు నచ్చినవారిని టిల్లు స్క్వేర్ ఏమాత్రం నిరాశపరచదు.

టిల్లు స్క్వేర్ ఎలా ఉండబోతుంది?

డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ కి వ్యత్యాసం ఉంటుంది. డీజే టిల్లు డెడ్ బాడీ నేపథ్యంలో సాగే బ్లాక్ కామెడీ. కానీ టిల్లు స్క్వేర్ అలా ఉండదు. ఒక కమర్షియల్ సినిమాలా ఉంటుంది. టిల్లు పాత్ర తీరు అలాగే ఉంటుంది. రాధిక పాత్ర ప్రస్తావన ఉంటుంది. మొదటి భాగాన్ని ముడిపెడుతూ కొన్ని సన్నివేశాలు ఉంటాయి. డీజే టిల్లుని గుర్తు చేస్తూనే టిల్లు స్క్వేర్ మీకొక కొత్త అనుభూతిని ఇస్తుంది.

అనుపమ ఎంపిక ఎలా జరిగింది?

అనుపమ గొప్ప నటి. ఈ సినిమాలో లిల్లీ పాత్ర ఛాలెంజింగ్ రోల్. ఆ పాత్ర కోసం ఎందరో పేర్లను పరిశీలించాం. కానీ అనుపమనే పర్ఫెక్ట్ ఛాయిస్ అనిపించింది. అనుపమని బోల్డ్ గా చూపించాలనే ఉద్దేశంతో లిల్లీ పాత్రను రాసుకోలేదు. లిల్లీ పాత్ర తీరే అలా ఉంటుంది. ఆ పాత్రకి ఆమె న్యాయం చేయగలదని నమ్మాము. ఆమె ఆ పాత్రకి నూటికి నూరు శాతం న్యాయం చేసింది.

టిల్లు-3 వచ్చే అవకాశముందా?

కొన్ని ఆలోచనలు ఉన్నాయి. భవిష్యత్ లో వచ్చే అవకాశముంది.

రీ షూట్ కి వెళ్ళడానికి కారణం ఏంటి?

ఇంటర్వెల్ తర్వాత ద్వితీయార్థం ప్రారంభ సన్నివేశాలు చాలా సినిమాల్లో తేలిపోతుంటాయి. ఫస్టాఫ్ బాగుంటుంది, క్లైమాక్ బాగుంటుంది. కానీ ఆ 15-20 నిమిషాలు ఆశించిన స్థాయిలో ఉండదు. టిల్లు స్క్వేర్ విషయంలో అలా జరగకూడదన్న ఉద్దేశంతో.. ఆ కొన్ని సన్నివేశాలు మరింత మెరుగ్గా రాసుకొని రీ షూట్ చేయడం జరిగింది.

విజయవంతమైన చిత్రానికి సీక్వెల్ కదా.. ఏమైనా ఒత్తిడికి లోనయ్యారా?

ఒత్తిడి ఉండటం సహజం. కానీ కథ బాగా రాసుకోవడంతో.. చిత్రీకరణ సమయంలో పెద్దగా ఒత్తిడి అనిపించలేదు. ఇక మొత్తం సినిమా చూసుకున్న తర్వాత ప్రేక్షకులను ఖచ్చితంగా మెప్పిస్తుంది అనే నమ్మకం కలిగింది.

సంగీతం దర్శకులు మారడానికి కారణం?

ముందు నుంచి మేము డీజే టిల్లు టీంతోనే వెళ్ళాలి అనుకున్నాం. పాటలు రామ్ మిరియాల, శ్రీచరణ్ పాకాల, నేపథ్య సంగీతం థమన్ అనుకున్నాం. రామ్ మిరియాల రెండు పాటలు ఇచ్చారు. శ్రీచరణ్ పాకాల ఒక పాట ఇచ్చారు. ఆ పాట బాగా వచ్చింది. కానీ అక్కడ సిట్యుయేషన్ మారడంతో మరో సంగీత దర్శకుడు అచ్చుతో పాట చేయించడం జరిగింది. థమన్ గారు ఇతర సినిమాలతో బిజీగా ఉండి అందుబాటులో లేకపోవడంతో..భీమ్స్ గారిని తీసుకున్నాం.

సితార సంస్థ గురించి?

బడ్జెట్ గురించి ఎప్పుడూ మాట్లాడరు. కంటెంట్ గురించి , క్వాలిటీ గురించే ఎక్కువ మాట్లాడతారు. యువ ప్రతిభను ప్రోత్సహించడంలో ముందుంటారు. సితార బ్యానర్ లో పనిచేయడం సంతోషంగా ఉంది.

సినిమాలో ఏమైనా సందేశం ఉంటుందా?

కొందరి స్వభావం ఎలా ఉంటుందో చూపించాము కానీ ఇలా ఉండకండి మారండి అనే సందేశాలు మాత్రం ఇవ్వలేదు.

Related Posts

Latest News Updates