హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల బెడద తీవ్రమవుతోంది. తమ వీధుల్లో కుక్కలపై ఫిర్యాదులు జీహెచ్ఎంసీకి వెల్లువలా వస్తున్నాయట. బల్దియాకి కేవలం 36 గంటల్లోనే 15 వేల ఫిర్యాదులు అందాయి. అంటే గంటకు సగటున 416 ఫిర్యాదులుఅన్నమాట. 500 వీధి కుక్కలను GHMC సిబ్బంది పట్టుకుంది. కానీ.. వారి లెక్కల ప్రకారమే నగరంలో 6 లక్షల వీధి కుక్కలున్నట్లు తెలుస్తోంది. కేవలం హైదరాబాద్ లోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా వీధి కుక్కలు విజృంభిస్తున్నాయి. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో.. వీధి కుక్కల దాడిలో మరో ఏడుగురు గాయపడ్డారు. బాధితుల్లో ఇద్దరు చిన్నారులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం జగన్నాథపురంలో 16 నెలల పాప ఇంటి ఆవరణలో బొమ్మలతో ఆడుకుంటుండగా.. వీధి కుక్క దాడి చేసింది. బాలిక ఎడమ చేతికి తీవ్ర గాయమవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేళ్ల పాపపై రెండు కుక్కలు దాడి చేశాయి. తలకు తీవ్రగాయాలవడంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీధి కుక్కులు చెలరేగిపోతున్నాయి.