గడప గడపకూ మన ప్రభుత్వం సమీక్షా కార్యక్రమానికి మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి గైర్హాజర్ అయ్యారు. దీంతో ఆయన వైసీపీపై అసంతృప్తితో వున్నారని, పార్టీ మారనున్నారన్న ప్రచారం బాగా జరిగింది. అయితే.. దీనిపై ఆళ్ల రామకృష్ణా రెడ్డి వివరణ ఇచ్చుకున్నారు. పార్టీ మారతారనేది అవాస్తవమని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఉన్నంతవరకు జగన్ వెంటే… లేకపోతే వ్యవసాయం చేసుకుంటానని స్పష్టం చేశారు. అనారోగ్య సమస్యతో నిన్న సీఎం సమావేశానికి హాజరుకాలేదని తెలిపారు. తనకు ఎప్పటికి నాయకుడు జగనేనని అన్నారు. అవసరమైతే పొలం పనులు చేసుకుంటాను తప్ప బాస్‌ను ఎదురించనని అన్నారు. తమ నాయకుడు జగన్ ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. తన ఇంట్లో ఫంక్షన్ వుండటం, అనారోగ్యం కారణంగానే రాలేదన్నార. 99 శాతం ఎమ్మెల్యేలు హాజరై… ఒకరో ఇద్దరో రాకపోతే.. దానిని హైలెట్ చేయడం ఏంటని మండిపడ్డారు.
ఇక మరో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా కీలక సమావేశానికి రాలేదు. దీనిపై ఆయన కూడా స్పందించారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో కోర్సు చేస్తున్నానని, ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్నాయని, అందుకే సమావేశానికి రాలేదని తెలిపారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ప్రత్యక్ష, పరోక్ష అనే ఎన్నికలు వుంటాయని, పరోక్ష ఎన్నికల్లో వైసీపీ పోటీ పడలేదని, అందుకే టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీట్లు గెలుచుకుందన్నారు. ఆర్థిక అంశాలే అందుకు దోహదం చేశాయన్నారు.