దువ్వూరి రామిరెడ్డి తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవలు చేసి, చిరస్థాయిగా నిలిచిపోయారని పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ చైర్మన్ అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ, జనని సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో దూవ్వూరి రామిరెడ్డి జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య విస్తాలి శంకరరావు అధ్యక్షుడిగా, ముఖ్య అతిథిగా అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. దువ్వూరి రామిరెడ్డి సాహిత్యాన్ని నేటి యువత బాగా అధ్యయనం చేయాలని, అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన సూచించారు. గొప్ప కవిగానే కాకుండా విమర్శకులుగా కూడా ఖ్యాతి గడించారని పేర్కొన్నారు.

 

 

ఇక.. అతిథిగా వచ్చిన నిర్మల పళనివేలు మాట్లాడుతూ… దువ్వూరి రామిరెడ్డి రైతు పక్షపాతి అని, అందుకే ఆయన కృషీవలుడు అన్న కావ్యాన్ని రాశారన్నారు. ఆయన పదాల విశిష్టత కూడా అద్భుతంగా వుంటుందన్నారు. దువ్వూరి రామిరెడ్డి సాహిత్యం విలక్షణమైందని, వారి రచనలు ఎంతో వైవిధ్యంగా వుంటాయని గూడురు లక్ష్మి అన్నారు. సాహిత్యాన్ని, వ్యక్తిత్వాన్ని సమన్వయం చేస్తూ వారి రచనలు సాగాయని లక్ష్మి అన్నారు. ఇక.. కార్యక్రమం చివర ఎం.ఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని నీలిమకు 20 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు.