ఐపీఎల్ 2023 సీజన్‌లో ఎట్టకేలకు చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. సొంతగడ్డపై లక్నో సూపర్ జెయింట్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన సీఎస్‌కే 12 పరుగుల తేడాతో గెలుపొందింది. బ్యాటింగ్‌లో రుతురాజ్.. బౌలింగ్‌లో మొయిన్ అలీ సత్తా చాటడంతో చెపాక్ మైదానంలో చెన్నై శుభారంభం చేసింది.
బ్యాటింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్ (31బాల్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 57), డెవాన్ కాన్వే (29 బాల్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 47).. బౌలింగ్‌లో మొయిన్ అలీ (4/26) మ్యాజిక్ చేయడంతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 12 రన్స్ తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించింది. ఈ హైస్కోరింగ్ పోరులో తొలుత చెన్నై 20 ఓవర్లలో 217/7 స్కోరు చేసింది. లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్, మార్క్ వుడ్ చెరో మూడు వికెట్లు తీశారు.
ఛేజింగ్‌లో ఓవర్లన్నీ ఆడిన లక్నో 205/7 స్కోరు చేసి ఓడింది. కైల్ మేయర్స్ (22 బాల్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 53) మెరుపు ఆరంభం ఇచ్చినా ఫలితం లేకపోయింది. అలీతో పాటు తుషార్ దేశ్‌పాండే రెండు వికెట్లు తీశాడు. బ్యాట్, బాల్‌తో రాణించిన మొయిన్ అలీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. చెన్నై ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే ఆట హైలైట్‌గా నిలిచింది. తొలివికెట్‌కు సెంచరీ పార్ట్‌నర్‌షిప్‌తో ఈ ఇద్దరు జట్టుకు భారీ స్కోరు అందించారు. టాస్ ఓడిన సీఎస్కే బ్యాటింగ్‌కు దిగగా గైక్వాడ్, కాన్వే పవర్ ప్లేను సద్వినియోగం చేసుకొని ఫోర్లు, సిక్సర్లతో జోరు చూపెట్టారు.